శ్రీవాణి దర్శనం టికెట్ల కోటా రోజుకు 1000 

11 Jan, 2023 03:52 IST|Sakshi

ఆన్‌లైన్‌లో 750, ఆఫ్‌లైన్‌లో 250 

తిరుమల: శ్రీవారి దర్శనం విషయంలో సా­మా­న్య భక్తులకు మరింత ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా శ్రీవాణి దర్శన టికెట్లను టీటీడీ రోజుకు 1,000కి పరిమితం చేసింది. ఇందులో ఆన్‌లైన్‌లో 750, ఆఫ్‌ లైన్‌లో 250 టికెట్లను జారీచేస్తారు. ఇప్పటికే టీటీడీ 500 టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయగా, అదనంగా బు­ధవారం మరో 250 టికెట్లు విడుదల చేయనుంది. మాధవం విశ్రాంతి గృహంలో శ్రీ­వాణి టికెట్ల కేటాయింపును టీటీడీ రద్దు చేసింది.

ఇక నుంచి శ్రీవాణి దాతలకు విమానాశ్ర­యంలో కరెంట్‌ బుకింగ్‌ కౌంటర్‌ను అందుబాటు­లో ఉంచారు. బోర్డింగ్‌ పాస్‌ ద్వారా తిరు­పతి ఎయిర్‌పోర్టు కౌంటర్‌లో మాత్రమే ఆఫ్‌­లైన్‌ టికెట్లు జారీ చేస్తారు. శ్రీవాణి దాతలు బ్రేక్‌ దర్శనం టికెట్‌కి బోర్డింగ్‌ పాస్‌ను జతచేయాలి. టికెట్‌పై ఎయిర్‌లైన్‌ రిఫరెన్స్‌తో కూ­డిన పీఎన్‌ఆర్‌ నంబర్‌ను కూడా నమోదు చే­యించాలి. వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని సి­బ్బం­ది బ్రేక్‌ దర్శన టికెట్‌తో పాటు బోర్డింగ్‌ పాస్‌ను తనిఖీ చేసి దర్శనానికి అనుమతిస్తారు. 

తిరుప్పావడ సేవ పునఃప్రారంభం
తిరుమల శ్రీవారి ఆలయంలో తిరుప్పావడ ఆర్జిత సేవ  ఈ నెల 12 నుంచి పునఃప్రారంభం కానుంది. ఇందుకోసం యాత్రికులు తిరుమలలోని సీఆర్‌వో కౌంటర్‌లో నమోదు చేసుకోవాలి. వీరికి బుధవారం సాయంత్రం ఐదు గంటలకు ఎల్రక్టానిక్‌ డిప్‌ ద్వారా 25 టికెట్లు జారీ చేస్తారు.  

నిర్ణీత సమయంలో శ్రీవారి దర్శనం
తిరుమలలో నిర్ణీత సమయంలో కేటాయించిన టైమ్స్‌ స్లాట్‌ టికెట్లకు త్వరితగతిన దర్శనమవుతోంది. సోమవారం అర్ధరాత్రి వరకు 56,003 మంది స్వామి వారిని దర్శించుకోగా, 20,365 మంది తలనీలాలు సమర్పించారు.  

మరిన్ని వార్తలు