బీసీలకు పెద్దపీట వేసింది వైఎస్‌ జగనే: ఆర్‌.కృష్ణయ్య 

30 Jan, 2023 06:10 IST|Sakshi

సాక్షి, అమరావతి: లోకేశ్‌ మాట్లా­డుతున్న తీరు చూ­స్తుంటే ఆయనకు బీసీ రిజర్వేషన్లపై కనీస అవగాహన లేదనే విషయం అర్థమవుతోందని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య స్పష్టంచేశారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను చంద్రబాబు 34 శాతానికి పెంచారని, సీఎం వైఎస్‌ జగన్‌ తగ్గించారంటూ లోకేశ్‌ పచ్చి అబద్ధాలు చెప్పడాన్ని జనం నమ్మే స్థితిలో లేరన్నారు.

ఈ విషయమై ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. వాస్తవంగా బీసీలకు చంద్రబాబు అన్యాయం చేస్తే సీఎం వైఎస్‌ జగన్‌ న్యాయం చేశారని వివరించారు. ఐదేళ్ల పాల­నలో స్థానిక సంస్థలకు ఎన్నికలే జరపని చంద్రబాబు.. బీసీలకు 34% రిజర్వేషన్లు ఎలా అమలు చేశారని లోకేశ్‌ను ప్రశ్నించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్లకు మించి పార్టీ పరంగా అవకాశాలు కల్పించిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు.

25 మంది ఉండే మంత్రివర్గంలో సైతం ఏకంగా 11 మంది బీసీలకు అవకాశం కల్పించారన్నారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పోస్టులు, పనుల్లోనూ 50 శాతంపైగా బీసీలకు కట్టబెట్టారని చెప్పారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని పార్లమెంట్‌లో ప్రైవేట్‌ బిల్లు పెట్టిన ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ అని, దమ్మున్న నాయకుడు సీఎం వైఎస్‌ జగన్‌ అని న్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు