నాడు ఎన్టీఆర్‌.. నేడు వైఎస్‌ జగన్

29 Mar, 2021 05:34 IST|Sakshi

బీసీలను అగ్రభాగాన నిలిపారు

దర్శక నిర్మాత, నటుడు ఆర్‌.నారాయణమూర్తి ప్రశంస

వజ్రపుకొత్తూరు: బీసీలను చట్ట సభలు, స్థానిక సంస్థల్లో నాడు ఎన్టీఆర్‌ అగ్ర భాగాన నిలిపితే నేడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  62 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పార్లమెంట్‌లో 54 శాతం సీట్లను ఇచ్చారని, వారికి సెల్యూట్‌ చేస్తున్నానని ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. ఎన్టీఆర్‌ తర్వాత అంతటి గొప్ప వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అని ప్రశంసించారు.

శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం పూండి సాయివినీత్‌ విద్యా సంస్థల ప్రాంగణంలో మత్స్యకార సామాజిక, సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో మత్స్యకార సర్పంచ్‌ల ఆత్మీయ సన్మాన సభ, విశాఖ–ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు.ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రైవేటీకరణ దుర్మార్గమని, 2000 సంవత్సరంలో గంగవరం పోర్టును సైతం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రైవేటుకు ధారాదత్తం చేసేందుకు అంగీకరించారని గుర్తు చేశారు. సీఎం జగన్‌ అలాంటి పనులు చేయకూడదని విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి పార్టీలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు.  

మరిన్ని వార్తలు