పద్మ అవార్డుల్లో ‘బుర్రా’కు తీరని అన్యాయం

8 Apr, 2021 03:31 IST|Sakshi
శాస్త్రి దంపతులకు అవార్డును ప్రదానం చేస్తున్న నారాయణమూర్తి, ఎమ్మెల్యే శివకుమార్, ప్రముఖులు

దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి మండిపాటు 

నటుడు జీఎస్‌ఎన్‌ శాస్త్రికి ‘బుర్రా’ పురస్కారం అందజేత

తెనాలి: భరతముని నాట్య శాస్త్రాన్ని రంగస్థలంపై అనుసరించిన మహానటుడు బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రికి రాష్ట్ర ప్రభుత్వం 14 పర్యాయాలు సిఫార్సు చేసినా, కేంద్రం పద్మశ్రీ అవార్డు ఇవ్వలేకపోయిందని సినీనటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. రంగస్థ్థలంపై స్త్రీ పాత్రలో సహజంగా నటించిన సుబ్రహ్మణ్యశాస్త్రిని అతని భార్యే గుర్తుపట్టలేకపోయారని దీనికి మించిన అవార్డు మరొకటి లేదని తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో బుధవారం కళల కాణాచి సంస్థ ఆధ్వర్యంలో బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారాన్ని ప్రఖ్యాత నటుడు జీఎస్‌ఎన్‌ శాస్త్రికి ప్రదానం చేశారు. ఆర్‌.నారాయణమూర్తి, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌లు రూ.25 వేల నగదు, జ్ఞాపికతో శాస్త్రి దంపతులను సత్కరించారు.

ఎమ్మెల్యే శివకుమార్‌ మాట్లాడుతూ..హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ తరహాలో తెనాలికి చెందిన మహనీయుల విగ్రహాలతో తెనాలి బండ్‌ను త్వరలోనే సాకారం చేయనున్నట్లు చెప్పారు. అవార్డు గ్రహీత శాస్త్రి తనకు పురస్కారంతో పాటు వచ్చిన రూ.25 వేలను సంస్థ కార్యకలాపాలకే వినియోగించాలని కోరుతూ దాన్ని నిర్వాహకులకు అందజేశారు. సభకు వేదగంగోత్రి ఫౌండేషన్, విజయవాడ వ్యవస్థాపకుడు వరప్రసాద్‌ అధ్యక్షత వహించారు. 

మరిన్ని వార్తలు