రబీ రికార్డు

23 Sep, 2020 04:39 IST|Sakshi

ముందెన్నడూ లేనివిధంగా రబీ ధాన్యం కొనుగోలు

రూ.6,008 కోట్ల విలువైన 32.97 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణ

తడిసిన ధాన్యం కొనుగోలుకూ కేంద్రాల ఏర్పాటు

ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు ముందస్తు ప్రణాళికలు 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా చూస్తోంది. రాష్ట్ర చరిత్రలో ముందెన్నడూ లేనివిధంగా ఈ రబీ సీజన్‌లో రికార్డు స్థాయిలో రైతుల నుండి ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఆగస్ట్‌ నెలాఖరు వరకు రబీ ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ.. నెల్లూరు వంటి జిల్లాల్లో ఆలస్యంగా కోతలు ప్రారంభించడం, ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడంతో అక్కడక్కడా ధాన్యం తడిసిపోయింది. దానిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో సీజన్‌ ముగిసినా రాష్ట్ర ప్రభుత్వమే అక్కడి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ రైతులకు ఉపశమనం కల్పిస్తోంది.  

సీజన్‌ ముగిసినా కొనుగోళ్లు 
► 2019–20 ఆర్థిక సంవత్సరంలో 1,442 కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.6,088.51 కోట్లు విలువ చేసే 32.97 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది.  
► ఇంకా రైతుల వద్ద మిగిలిపోయిన ధాన్యాన్ని అక్టోబర్‌ 31వ తేదీ వరకు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టింది. 
► గ్రామ స్థాయిలోనే ధాన్యం సేకరించడం వల్ల కొనుగోలు కేంద్రాలు లేదా మిల్లులకు తరలించేందుకు అయ్యే రవాణా చార్జీల భారం నుంచి రైతులు బయటపడ్డారు. 
► లక్ష్యానికి మించి ధాన్యం కొనుగోలు చేయడం ద్వారా ఈసారి కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు, అండమాన్, నికోబార్‌ దీవులకు బియ్యం పంపించి మన రాష్ట్రం అక్కడి ప్రజల ఆహార కొరత తీర్చగలిగింది. 
► ఖరీఫ్‌లో 62 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాలనే లక్ష్యంతో ప్రణాళికలను సిద్ధం చేశారు.  

మరిన్ని వార్తలు