చరిత్రాత్మక పరిపాలన 

7 May, 2022 10:50 IST|Sakshi

సచివాలయాలతో సమూల మార్పులకు శ్రీకారం

ప్రతి పేద కుటుంబానికి   ప్రభుత్వ పథకాలు

అభివృద్ధి, సంక్షేమమే సీఎం జగన్‌ లక్ష్యం

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి

దగదర్తి (కావలి): రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా, పాలనలో పారదర్శకత ఉండేలా తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థ చరిత్రలో నిలిచిపోనుందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. దగదర్తి మండలం కొత్తపల్లికౌరుగుంటలో స్వయం సహాయక సంఘాలకు పావలా వడ్డీ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎంపీ ఆదాల, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మండలంలోని 719 సంఘాలకు సంబంధించి రూ.97 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఆదాల మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాలనను, సంక్షేమ పథకాలను పేదల ముంగిటకే తీసుకువెళ్లాలనే లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను అమల్లోకి తీసుకువచ్చారని తెలిపారు.
   
మూడు విడతల్లో రూ.25 కోట్లు పంపిణీ  
కావలి నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ పథకం కింద మూడు విడతల్లో రూ.25 కోట్లు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. స్వయం సహాయక సంఘాల బలోపేతానికి మరిన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో రైతాంగానికి అండగా నిలబడేందుకు డీఎం చానల్, డీఆర్‌ చానల్, కావలి కాలువ అభివృద్ధి పనులకు చేపడుతున్న చర్యలను వివరించారు.

సంక్షేమ పథకాలను అడ్డుకుని పేదలను, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని టీడీపీ నాయకులు తప్పుడు కేసులతో కోర్టులను అడ్డు పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క దగదర్తి మండలంలోనే కోర్టు కేసుల కారణంగా ఎనిమిది గ్రామాల్లో ఇళ్ల స్థలాల పంపిణీకి అడ్డంకులు ఏర్పడ్డాయని వివరించారు.  కార్యక్రమంలో ఎంపీపీ తాళ్లూరు ప్రసాద్‌నాయుడు, విజయా డెయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ డైరెక్టర్‌ అనిల్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గోగుల వెంకయ్యయాదవ్, పలువురు అధికారులు, సిబ్బంది, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు