గుంటూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్‌

13 Aug, 2022 04:03 IST|Sakshi
గుంటూరు వైద్య కళాశాల

విచారణ చేసిన వైద్య అధికారులు 

గుంటూరు మెడికల్‌: గుంటూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్‌ జరిగిందని ఫిర్యాదులు రావడంతో శుక్రవారం వైద్య కళాశాల అధికారులు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పీజీ మహిళా వైద్యులను పిలిపించి విచారణ చేశారు. గుంటూరు జీజీహెచ్‌లో హౌస్‌ సర్జన్‌గా (ఇంటర్నీ) విధులు నిర్వహిస్తున్న ఓ వైద్య విద్యార్థిని తనను పీజీ విద్యార్థినులు వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేసింది.

ఎన్‌ఎంసీ అధికారులు సదరు ఘటనపై తక్షణమే విచారణ నిర్వహించాలని ఆదేశిస్తూ శుక్రవారం వైద్య కళాశాల అధికారులకు మెయిల్‌ ద్వారా ఉత్తర్వులు పంపారు. దీంతో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చాగంటి పద్మావతీదేవి ఆధ్వర్యంలో పలువురు యాంటీ ర్యాగింగ్‌ కమిటీ సభ్యులు ర్యాగింగ్‌ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పీజీ మహిళా వైద్యులను పిలిపించి విచారించారు. కాగా, ఏప్రిల్‌లో మెన్స్‌ హాస్టల్‌లో సీనియర్‌ వైద్య విద్యార్థులు ర్యాగింగ్‌ చేస్తున్నారంటూ జూనియర్‌ వైద్య విద్యార్థులు ఎన్‌ఎంసీకి ఫిర్యాదు చేశారు.

నాడు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పద్మావతీదేవి సీనియర్‌ వైద్య విద్యార్థులు, జూనియర్‌ వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి ర్యాగింగ్‌ విష సంస్కృతిని అనుసరించవద్దని, ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా మళ్లీ కళాశాలలో ర్యాగింగ్‌ జరగడం గమనార్హం.  

మరిన్ని వార్తలు