దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై నోరు మెదపని రైల్వే బడ్జెట్‌

2 Feb, 2023 04:40 IST|Sakshi

నిరాశ పరిచిన కేంద్రం తీరు.. రైల్వే జోన్‌పై ప్రకటన లేకపోవడంపై విమర్శలు

సాక్షి, అమరావతి: ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లోనూ విశాఖపట్నం రైల్వే జోన్‌ కూత వినిపించలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బుధవారం 2023–24 వార్షిక బడ్జెట్‌లో అంతర్భాగంగా ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌ రాష్ట్రానికి తీవ్ర నిరాశ కలిగించింది. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక డిమాండ్‌ అయిన విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ఆచరణలోకి తీసుకువచ్చే అంశంపై కేంద్రం మౌనం దాల్చింది. రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా ఇచ్చిన హామీకి కట్టుబడి రైల్వే జోన్‌ను ఆచరణలోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్‌సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావించారు. రైల్వే ప్రాజెక్టుల్లో  రాష్ట్రానికి తగిన ప్రాధాన్యం కల్పించాలని నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కీలక ప్రతిపాదనలతో కూడిన నివేదికను కేంద్రానికి సమర్పించింది. అయినప్పటికీ కేంద్ర వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదు. బడ్జెట్‌లో రైల్వేశాఖకు కేటాయింపులపై పూర్తి వివరాలతో బ్లూ బుక్‌ వస్తే గానీ రాష్ట్రంలో ఇతర రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం విధానమేమిటన్నది స్పష్టం కాదు.

‘బ్లూ బుక్‌’ వస్తేనే..
కేంద్ర బడ్జెట్‌లో రైల్వే శాఖకు కేటాయింపులపై సమగ్ర వివరాలతో ‘బ్లూ బుక్‌’ శుక్రవారం విజయవాడలోని రైల్వే డీఆర్‌ఎం కార్యాలయానికి చేరుతుంది. అది వస్తేగానీ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం కేటాయింపులు ఏమిటన్నది తెలియదు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు, కొత్త లైన్ల కోసం సర్వేలు, కొత్త ఆర్వోబీల నిర్మాణం, ప్రత్యేక ఫ్రైట్‌ కారిడార్‌ ఏర్పాటు, కొత్త రైళ్ల కేటాయింపులు మొదలైన అంశాలపై అప్పుడే స్పష్టత వస్తుంది. 

స్పష్టత ఇవ్వని కేంద్రం..
రైల్వే జోన్‌ ఏర్పాటు ప్రక్రియను కొన్ని నెలల క్రితమే సూత్రప్రాయంగా ప్రారంభించినప్పటికీ.. జోన్‌ వాస్తవంగా ఆచరణలోకి ఎప్పుడు వస్తుందన్న దానిపై ఈసారి కేంద్ర బడ్జెట్‌లో అయినా స్పష్టత వస్తుందని అంతా ఆశించారు. కానీ ఎలాంటి స్పష్టతను కేంద్రం ఇవ్వలేదు. ఇప్పటికే విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్‌’ ఏర్పాటు కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను రైల్వే శాఖ రూపొందించింది. భవనాలు, ఇతర అవసరాలకోసం విశాఖలో దాదాపు 950 ఎకరాలు అందుబాటులో ఉందని పేర్కొంది.

రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో విశాఖపట్నంలో రైల్వే జోన్‌ కార్యాలయాల నిర్మాణానికి ఇటీవల రూ.170 కోట్లు కేటాయించింది కూడా. కానీ రైల్వే జోన్‌ ఆచరణలోకి రావాలంటే సాంకేతికంగా కీలక అంశాలపై కేంద్రం మౌనం వహిస్తోంది. భువనేశ్వర్‌ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్, సికింద్రాబాద్‌ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్‌లతో ఏపీ పరిధిలో ఆస్తుల పంపకం, కొత్త డివిజన్ల ఏర్పాటు, ఉద్యోగుల కేటాయింపు, కొత్త కార్యాలయాల ఏర్పాటు తదితర అంశాలను ఓ కొలిక్కి తీసుకువచ్చి దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ఆచరణలోకి తీసుకురావాలి. కానీ.. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఈ విషయాలేవీ కనీసం ప్రస్తావించలేదు. 

ఒడిశాలో రాజకీయ ప్రయోజనాల కోసమేనా!
ఒడిశాలో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పరిశీలకులు విమర్శిస్తున్నారు. ప్రధానంగా విశాఖ కేంద్రంగా వాల్తేర్‌ రైల్వే డివిజన్‌ను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు డిమాండ్‌ చేస్తుండగా.. వాల్తేర్‌ రైల్వే డివిజన్‌ను రద్దు చేసి.. విశాఖపట్నం, విజయవాడ, గుంటూ­రు, గుంతకల్‌ రైల్వే డివిజన్లతోనే కొత్త జోన్‌ ఏర్పాటుపై డీపీఆర్‌లో ప్రస్తావించా­రు. దీనిపై విశాఖపట్నంతోపాటు యా­వత్‌ రాష్ట్రంలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యా­యి.

విజయవాడ నుంచి విశాఖపట్నం 350 కి.మీ. దూరంలో ఉండగా.. రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఇచ్చాపురం 580 కి.మీ. దూరంలో ఉంది. అంతవరకు విజయవాడ రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేస్తే పరిపాలన నిర్వహణ సమస్యలు ఏర్పడతాయి. అందుకే వాల్తేర్‌ రైల్వే డివిజన్‌ను కొనసాగిస్తూనే విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ కావాలని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. కానీ ప్రస్తు­తం తూర్పు కోస్తా జోన్‌లో అత్యధిక రా­బడి ఉన్న వాల్తేర్‌ డివిజన్‌ను ఏకంగా రద్దు చేయాలని కేంద్రం భావిస్తోంది.

తద్వారా భువనేశ్వర్‌ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్‌ ఆర్థిక ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది. ఒడిశాలో బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించేందుకే ఇలా వ్యవహరిస్తోంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఒడిశా క్యాడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్‌ అధికారి కావడం గమనార్హం. ఆయన కూడా ఒడిశాకు అనుకూలంగా వ్యవహరిస్తూ విశాఖపట్నం రైల్వే జోన్‌ అంశాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని పరిశీలకులు విమర్శిస్తున్నారు.  

మరిన్ని వార్తలు