విద్యుత్‌ వెలుగు.. మార్గం మెరుగు

24 Apr, 2022 18:59 IST|Sakshi

రాజంపేట: ఇటు వైఎస్సార్, అటు కర్నూలు జిల్లాలకు అనుసంధానంగా నిర్మితమైన ఎర్రగుంట్ల–నంద్యాల రైలుమార్గంలో విద్యుద్దీకరణ పూర్తి అయింది.  ఈ యేడాది మార్చి నుంచి లాంఛనంగా కరెంటు రైలింజన్లతో నడిపిస్తున్నారు. రూ.976 కోట్లతో నంద్యాల–ఎర్రగుంట్ల రైలుమార్గం నిర్మించారు. ఈ మార్గంలో తొలి ప్యాసింజర్‌ రైలును 2016 ఆగస్టు 20న నడిపించారు.  

123 కిలోమీటర్ల మేర.. 
నంద్యాల –ఎర్రగుంట్ల మధ్య 123 కిలోమీటర్ల మేర రైలుమార్గం విద్యుద్దీకరణ  పూర్తి కావడంతో కొత్తరైళ్లను కూడా నడిపించే అవకాశాలున్నాయి. గతంలో డీజిల్‌ లోకోతో నడిచేవి. ఈ మార్గంలో గూడ్స్‌రైళ్లు నడుస్తున్నాయి. డీజిల్‌ ఇంజిన్ల వినియోగాన్ని తగ్గించేందుకు రైల్వేలో విద్యుద్దీకరణకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తోంది. గత బడ్జెట్‌లో ఎర్రగుంట్ల–నంద్యాల రైలుమార్గం విద్యుద్దీకరణకు రూ.150 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే, నంద్యాలవైపు నుంచి మద్దూరు, బనగానపల్లె, కోవెలకుంట్ల, సంద్యాల, నొస్సం, ఉప్పలపాడు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల వరకు ట్రాక్షన్‌ రైలుమార్గంగా కొనసాగింది. 

8 కొత్తరైళ్లు నడిచేనా.. 
నంద్యాల–ఎర్రగుంట్ల రైలుమార్గంలో కొత్తరైళ్లు నడిచేనా అన్న అంశం నేడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ మార్గంలో ధర్మవరం– విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ రైలు మాత్రమే నడుస్తోంది. ప్రారంభంలో నడిచిన నంద్యాల– కడప డెమో ప్యాసింజర్‌ను కరోనా సీజన్‌లో రద్దు చేశారు. తిరిగి ఆ రైలు ఇంతవరకు పట్టాలెక్కలేదు.  

రైలుమార్గం విద్ద్యుద్దీకరణ కావడం వల్ల కర్నూలు, కడపల మీదుగా ఇటు తిరుపతికి, అటు గుత్తి, గుంతకల్‌ మీదుగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు రైళ్లను నడిపించేందుకు (డీజిల్‌ లోకోలతో పనిలేకుండా) మార్గం సులువైంది. అలాగే కడప నుంచి విజయవాడకు డైలీ రైలును ఈ మార్గం మీదుగా నడిపిస్తే మరింత అనుకూలంగా ఉంటుందని పేర్కొంటున్నారు. నంద్యాల– ఎర్రగుంట్ల రైలు మార్గం విద్యుద్దీకరణ నేపథ్యంలో మరిన్ని కొత్త రైళ్లను నడిపేలా రైల్వే అధికారులు చర్యలు చేపట్టాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. 

(చదవండి: సారూ... పిల్లలతో పని చేయిస్తే ఎలా? )

మరిన్ని వార్తలు