టమాటా దిగుబడులపై వర్షం ఎఫెక్ట్‌

10 Oct, 2021 03:49 IST|Sakshi
మార్కెట్‌కు శనివారం రైతులుతీసుకువచ్చిన టమాటా

మదనపల్లె మార్కెట్‌లో పెరుగుతున్న ధరలు  

మదనపల్లె(చిత్తూరు జిల్లా): టమాటా దిగుబడులపై వర్షాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మార్కెట్‌కు అంతంతమాత్రంగా వస్తున్న టమాటా దిగుబడులు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మరింతగా తగ్గిపోయాయి. వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో కాయలపై మచ్చలు వచ్చి.. తెగుళ్లు సోకుతున్నాయి. పంట నాణ్యతగా ఉండడం లేదు. గత నెల 9న రైతులు మార్కెట్‌కు 445 మెట్రిక్‌ టన్నుల టమాటాలు తీసుకువచ్చారు. ఇందులో మెదటి రకం టమాట ధర కిలో రూ.14 వరకు పలికింది. ప్రస్తుతం దిగుబడులు 70 శాతం మేర తగ్గిపోయింది.

ఇతర రాష్ట్రాల్లో వర్షాలకు పంట దెబ్బతినడం, డిమాండ్‌కు తగ్గ సరుకు లేకపోవడంతో ధరలు పెరిగిపోతున్నాయి. శనివారం చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌ యార్డులో మొదటిరకం టమాటా ధర కిలో రూ.35 నుంచి రూ.52 మధ్య పలికింది. రెండో రకం రూ.16 నుంచి రూ.33 మధ్య నమోదైంది. తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాల నుంచి రైతులు 86 మెట్రిక్‌ టన్నుల టమాటాను మార్కెట్‌కు తీసుకువచ్చారు. కోత దశ చివరిది కావడంతో టమాటా దిగుబడులు తగ్గాయని, రబీ సీజన్‌ ప్రారంభమయ్యాక దిగుబడులు పెరిగే అవకాశం ఉందని హార్టికల్చరల్‌ ఆఫీసర్‌ సౌజన్య తెలిపారు.  

మరిన్ని వార్తలు