బలహీనపడిన వాయుగుండం

13 Sep, 2022 05:43 IST|Sakshi

నేడు, రేపు తేలికపాటి వర్షాలు 

18న ఉపరితల ఆవర్తనం! 

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడి ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, విదర్భపై ఉన్న వాయుగుండం సోమవారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. ఇది మధ్యప్రదేశ్‌ మీదుగా వాయవ్య దిశగా కదులుతూ కొద్ది గంటల్లో మరింత బలహీనపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు అల్పపీడన ప్రాంతం మీదుగా ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించింది. అదే సమయంలో రాష్ట్రంపైకి నైరుతి గాలులు వీస్తున్నాయి.

వీటి ఫలితంగా మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి నివేదికలో తెలిపింది.

మంగళవారం తీరం వెంబడి గంటకు 45–55.. గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. మరోవైపు ఈనెల 18న ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ భారీవర్షాలు కురిశాయి. చింతూరులో 4 సెంటీమీటర్లు, వీరఘట్టంలో 3.3, జియ్యమ్మవలసలో 3.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.    

మరిన్ని వార్తలు