Rain Alert: ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఇటు భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరిక జారీ

9 Aug, 2022 17:33 IST|Sakshi

సాక్షి, అమరావతి/విశాఖపట్నం: కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి స్థిరంగా కొనసాగుతోంది. దీని వల్ల ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి 45-55 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ క్రమంలో మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. 

ఇదిలా ఉండగా.. భారీ వరదల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరుకుంది. దీంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాగా, పెరుగుతున్న వరద ప్రవాహం కారణంగా గోదావరి నీటిమట్టం 55 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో, గోదావరి పరివాహక ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సూచించారు. ప్రస్తుతం ఎగువ నుంచి గోదావరిలోకి 9,35,465 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. 

మరోవైపు.. తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరిలో నీటి మట్టం 9.8 అడుగులకు చేరుకుంది. 7 లక్షల 26 వేల క్యూసెక్కుల నీరు బ్యారేజ్ నుండి సముద్రంలోకి చేరుతోంది. డెల్టా కాలువలకు 6 వేల క్యూసెక్కుల నీరు సరఫరా అవుతున్నట్టు అధికారులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: 9 నుంచి వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర బృందాలు

మరిన్ని వార్తలు