Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. శనివారం నాటికి...

9 Sep, 2022 04:00 IST|Sakshi

నేడు, రేపు విస్తారంగా వానలు 

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడింది. ఇది శనివారంనాటికి ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశాలకు చేరువలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో అనేక చోట్ల విస్తారంగా, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి వెల్లడించింది.

శుక్రవారం ఉమ్మడి గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురవవచ్చని తెలిపింది. శనివారం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు అవకాశం ఉందని వివరించింది.

ఆదివారం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు, కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రానున్న నాలుగు రోజులు కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. పిడుగులతో కూడిన అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సూచించారు.  

మరిన్ని వార్తలు