మరింత బలపడుతున్న అల్పపీడనం

12 Jun, 2021 03:33 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా 4 రోజులు వర్షాలు 

2 రోజులు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు 

సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఒడిశా, పశ్చిమబెంగాల్‌ తీరాల మధ్య కేంద్రీకృతమై ఉన్న ఈ అల్పపీడనం శనివారం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, ఒడిశా మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదలవచ్చని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం తుపానుగా మారే అవకాశం లేదని చెప్పారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో 2 రోజులు పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులు వర్షాలు పడతాయని తెలిపారు.

ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉంటుందని, పలుచోట్ల మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించడంతో వాటి ప్రభావంతో కూడా వర్షాలు ఎక్కువగా కురిసే పరిస్థితి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో 15వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని సూచించింది.  

మరిన్ని వార్తలు