నేడు, రేపు భారీ వర్షాలు

19 Jul, 2021 03:11 IST|Sakshi
పుట్టపర్తి సమీపంలో చిత్రావతి నది పరవళ్లు

21న అల్పపీడనం ఏర్పడే అవకాశం

కదిరిలో 23 సెం.మీ. వర్షపాతం నమోదు

సాక్షి, అమరావతి/విశాఖపట్నం/అనంతపురం: దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అందువల్ల ఈ నెల 20, 21 తేదీల్లో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ నెల 21న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వెల్లడించింది. ఇది బలపడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని.. ఒకవేళ బలపడి వాయుగుండంగా మారితే ఒడిశా వైపు కదులుతుందని వివరించింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

కదిరిలో రికార్డు స్థాయి వర్షపాతం
రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. జిల్లా చరిత్రలోనే తొలిసారిగా కదిరిలో అత్యధికంగా 23 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పెనుకొండ, హిందూపురం పట్టణాల్లో అతిభారీ వర్షాలు కురిశాయి. లేపాక్షిలో 10.04 సెం.మీ., ఎన్‌పీ కుంటలో 9, అమడగూరులో 8.52 చిలమత్తూరులో 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కదిరిలోని ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి పెద్దఎత్తున వర్షం నీరు చేరింది. ఓడీ చెరువు సమీపంలో ప్రధాన రహదారి తెగిపోవడంతో కదిరి, హిందూపురం, బెంగళూరు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పుట్టపర్తి వద్ద చిత్రావతి, కుషావతి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో 3 నుంచి 6 సె.మీ. వర్షం కురిసింది. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోనూ చాలాచోట్ల వర్షాలు కురిశాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు