బంగాళాఖాతంలో అల్పపీడనం 

10 Nov, 2022 03:58 IST|Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం:  నైరుతి బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. మరోవైపు అల్పపీడన ద్రోణి మధ్య బంగాళాఖాతం నుంచి ఉపరితల ఆవర్తన ప్రాంతం వరకు కొనసాగుతోంది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది.

ఇది వాయవ్య దిశగా కదులుతూ 12వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాలకు విస్తరిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. ఈ ప్రభావంతో గురువారం ఉత్తర కోస్తాలో అక్కడక్కడ, దక్షిణ కోస్తాలో అనేక చోట్ల, రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

శుక్ర, శనివారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని వివరించింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉందని తెలిపింది.

అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో తీరం వెంబడి గంటకు 40–45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని తెలిపింది. తీరాల వెంబడి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సూచించారు.  

మరిన్ని వార్తలు