బలహీనపడిన అల్పపీడనం 

13 Nov, 2022 05:20 IST|Sakshi

నేడు అరేబియా సముద్రంలో విలీనం 

దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వానలు  

సాక్షి, అమరావతి/విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతం, ఉత్తర కోస్తా తమిళనాడు, పుదుచ్చేరి పరిసర ప్రాంతాలపై కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం శనివారం అల్పపీడనంగా బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అయితే, అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు, కేరళ మీదుగా ప్రయాణించి ఆదివారం తూర్పు మధ్య అరేబియా సముద్రంలో విలీనమవుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఉత్తర కోస్తాంధ్రలో వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఈ నెల 16న ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ తెలిపింది. కాగా, అల్పపీడనం ప్రభావంతో శనివారం నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కారేడులో 5.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పొదిలి, కావలి, చీమకుర్తి, లింగసముద్రం, ఉలవపాడు, నగరి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.    

మరిన్ని వార్తలు