మూడు రోజుల పాటు వర్షాలు

3 Jun, 2021 04:30 IST|Sakshi

నేడు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఆగ్నేయ అరేబియాలో నైరుతి రుతుపవనాలు బలపడుతున్నాయి. రుతుపవనాలు గురువారం కేరళను తాకనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం బుధవారం తెలిపింది. కాగా, నైరుతి రుతుపవనాల రాక వల్ల అకాల వర్షాలు వస్తాయని, ఆ ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్రా, దక్షిణ కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. బుధవారం రాష్టంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. కృష్ణా జిల్లా నూజివీడులో 122 మిల్లీమీటర్లు, అగిరిపల్లిలో 109, తోటపల్లిలో 99, శ్రీకాకుళం జిల్లా పాలకొండలో 98.5, పలాసలో 50, కంచిలిలో 48, మెళియాపుట్టి, రాజాంలలో 47, ఇచ్ఛాపురంలో 46.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

విజయనగరం జిల్లా బొండపల్లి, నెల్లిమర్లలో 44.25 మిల్లీమీటర్లు, సీతానగరంలో 41.5, విశాఖ జిల్లా కె.కోటపాడులో 34.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. ముంచంగిపుట్టు మండలంలోని బిరిగూడ, ముత్తగుమ్మి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. 23 పశువులు, 6 మేకలు మృత్యువాత పడగా.. ఓ పశువుల కాపరికి తీవ్ర గాయాలయ్యాయి.  

మరిన్ని వార్తలు