AP: మూడు రోజులు వర్షాలు 

28 Oct, 2021 05:28 IST|Sakshi

కొన్నిచోట్ల భారీ వర్షాలకు అవకాశం

సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. రానున్న మూడు రోజుల్లో అల్పపీడనం పశ్చిమ దిశగా ప్రయాణించనుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ద్రోణి వాయవ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

కోస్తా, రాయలసీమల్లో రానున్న మూడురోజులు విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపారు. గురువారం నుంచి 30వ తేదీ వరకు మూడురోజులు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా, చిత్తూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని వివరించారు. 29, 30 తేదీల్లో విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వానలు కురిశాయి.  

మరిన్ని వార్తలు