మూడు రోజులు వానలు!

25 Aug, 2022 04:08 IST|Sakshi

ఆవర్తనాల ప్రభావం

గురు, శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

భారత వాతావరణ విభాగం వెల్లడి

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురవడానికి పరిస్థితులు అనుకూలంగా మారాయి. కొద్ది రోజులుగా రాష్ట్రంలో వానలు తగ్గాయి. కొన్నిచోట్ల అరకొరగా కురుస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు కాస్తున్నాయి. తాజాగా ఉత్తర బంగాళాఖాతం మీదుగా వాయవ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి వైపునకు వంగి ఉంది. మరోవైపు ఉత్తర మధ్య అంతర్భాగ తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన మరో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది.

వీటి ఫలితంగా బుధవారం రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అనంతపురం జిల్లా బీకే సముద్రం మండలం రేకులకుంటలో అత్యధికంగా 17.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురు, శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

మరిన్ని వార్తలు