విస్తరిస్తున్న ‘ఆవర్తనం’

28 Jun, 2021 03:44 IST|Sakshi
భారీ వర్షం కురవడంతో కర్నూలు జిల్లా మంత్రాలయంలోని పాఠశాల ఆవరణలో నీరు

మరో రెండ్రోజులు వర్షాలే

హంసలదీవి తీరంలో విరుచుకుపడిన రాకాసి అలలు

ధ్వంసమైన పాలకాయతిప్ప బీచ్‌ రోడ్డు

సముద్రంలోకి కొట్టుకుపోయిన సిమెంట్‌ బెంచీలు

మంత్రాలయం జలమయం

సాక్షి, అమరావతి/ విశాఖపట్నం/ అవనిగడ్డ/ కర్నూలు: దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాలపై ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ఆంధ్రప్రదేశ్‌ తీరానికీ విస్తరించింది. దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో (సోమ, మంగళవారాలు) రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని తీర ప్రాంతాల పరిసరాల్లో సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. మరోవైపు అల్పపీడన ప్రభావం వల్ల రాష్ట్రంలో పశ్చిమ, వాయవ్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవగా, అనేక ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. కర్నూలు జిల్లాలో తుంగభద్ర పరీవాహక ప్రాంతాలైన మంత్రాలయం, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురవడంతో నదిలో వరద నీరు పోటెత్తింది. గోనెగండ్ల, గూడూరు, సీ.బెళగల్, వెల్దుర్తి తదితర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడటంతో హంద్రీ నదికి వరద చేరింది. మంత్రాలయం క్షేత్రం జలమయమైంది. నల్లవాగు, తుమ్మలవాగు పొంగడంతో రాకపోకలు స్తంభించాయి.

తుమ్మలవాగులో లారీ చిక్కుకుపోగా అతి కష్టం మీద బయటకు తీశారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు జిల్లాలోని కోడుమూరులో అత్యధికంగా 120.4 మి.మీ., ఎమ్మిగనూరులో 116.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం 8 గంటల సమయానికి గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 54.8 మి.మీ వర్షం కురిసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 52.5, గూడూరులో 41.5, శ్రీకాకుళం జిల్లా కోవిలంలో 39.3, రేగిడి ఆముదాలవలసలో 35.3, పాలకొండలో 34.5, బొబ్బిలిలో 32, కర్నూలు జిల్లా మంత్రాలయంలో 31.5, కృష్ణా జిల్లా గుడివాడలో 30.8, విజయనగరం జిల్లా బొండేపల్లిలో 30.5 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 45 ప్రాంతాల్లో 15 నుంచి 30 మి.మీ. వర్షం పడగా, అనేకచోట్ల 5 నుంచి 16 మి.మీ. వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో మచిలీపట్నం జలమయమైంది. విజయవాడలో తేలికపాటి జల్లులు కురిశాయి. 

హంసలదీవి తీరంలో రాకాసి అలలు
కృష్ణా జిల్లా హంసలదీవి సాగర తీరం అల్లకల్లోలంగా మారింది. పాలకాయతిప్ప బీచ్‌ వద్ద సముద్ర అలలు 4 మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. సముద్రపు నీరు సుమారు 200 మీటర్ల మేర ముందుకు చొచ్చుకువచ్చి డాల్ఫిన్‌ భవనం చుట్టూ చేరింది. తీరం పొడవునా పర్యాటకులు సేదతీరేందుకు ఏర్పాటు చేసిన సిమెంట్‌ బల్లలు సముద్ర అలల ధాటికి కొట్టుకుపోయాయి. తీరానికి వెళ్లే రహదారి ముందు భాగాన్ని అలలు బలంగా తాకడంతో ధ్వంసమైంది. తారు, మట్టి కొట్టుకుపోయి కొండరాళ్లు బయటపడ్డాయి. బీచ్‌ నుంచి సాగర సంగమం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర ఇసుక తిన్నెలు కోతకు గురయ్యాయి. సముద్ర స్థితిగతుల్లో మార్పులు చోటుచేసుకున్నాయని, పర్యాటకులెవదూ తీరానికి రావద్దని అధికారులు కోరారు.

మరిన్ని వార్తలు