కాకినాడ తీరంలో అల్పపీడనం

12 Jul, 2021 02:40 IST|Sakshi

నేడు, రేపు వర్షాలు

సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఆదివారం మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడింది. ఇది ప్రస్తుతం కాకినాడ తీరానికి సమీపంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపో ఆవరణం వరకూ విస్తరించి ఉంది. అల్పపీడనం కారణంగా.. ఉత్తర కోస్తాంధ్ర మీదుగా ఒడిశా, మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ వరకూ సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది. అల్పపీడనం వల్ల రాష్ట్రంపై తేమ గాలుల తీవ్రత పెరిగింది. దీనికితోడు దక్షిణం నుంచి రుతుపవన గాలులు విస్తరిస్తున్నాయి.

ఈ కారణంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో సోమ, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ., గరిష్టంగా 60 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులెవరూ సోమవారం వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.

మరోవైపు కర్ణాటకలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, తుంగభద్రలోకి వరద నీరు భారీగా వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గడచిన 24 గంటల్లో సామర్లకోటలో 8.3 సెం.మీ., రంగంపేటలో 6.6, గొల్లప్రోలులో 6.3, జగ్గంపేటలో 5.9, పెద్దాపురంలో 5.3, రాజవొమ్మంగి, పిఠాపురంలో 4.8, నక్కపల్లిలో 4.7, దేవీపట్నంలో 4.6 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.  

మరిన్ని వార్తలు