మరో రెండ్రోజులు తేలికపాటి వానలు

22 Aug, 2021 02:46 IST|Sakshi

రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలకు ఆస్కారం

కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షపాతం

నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

పొంగిపొర్లిన వాగులు.. పొలాల్లో వరద నీరు

గుంటూరు – తుళ్లూరు మధ్య నిలిచిన రాకపోకలు

సాక్షి,విశాఖపట్నం/కోడూరు(అవనిగడ్డ)/బుట్టాయగూడెం/సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ఆదివారం, సోమవారం అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు, ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తెలంగాణ, రాయలసీమ మీదుగా కోస్తా తీరం వరకు ఆవరించి ఉంది. ఇది సముద్రమట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కృష్ణా జిల్లా భావదేవరపల్లిలో అత్యధికంగా 14.7 సెం.మీ వర్షం కురిసింది. నాగాయలంకలో 12.1, గణపవరంలో 9.8, అవనిగడ్డలో 9.4, పెనుమంట్ర, రేపల్లెల్లో 8.6, బైరెడ్డిపల్లెలో 8.4, రెడ్డిగూడెంలో 8.0, నిడదవోలులో 7.4, అద్దంకిలో 7.0, చింతలపూడిలో 6.7, అత్తిలిలో 6.3, గొలుగొండలో 6.1, విజయవాడలో 6.0, నున్నలో 5.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. 

కృష్ణా జిల్లా కోడూరులో నీట మునిగిన ఆలయం.. 
శనివారం కురిసిన భారీ వర్షాలకు కృష్ణా జిల్లా కోడూరు మండల కేంద్రంలో శ్రీబాల త్రిపుర సుందరీ సమేత సోమేశ్వరస్వామి ఆలయం నీట మునిగింది. ఆలయం లోపల మోకాలు లోతున నీరు చేరడంతో స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించేందుకు అర్చకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మూడు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి కొండవాగులు పొంగిపొర్లాయి. బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం సమీపంలోని జల్లేరు వాగు, పాలకుంట, కాకులవారిగూడెం, పద్మవారిగూడెం సమీపంలో వాగులు, కేఆర్‌ పురంలో బైనేరు వాగు ఉధృతంగా ప్రవహించాయి. జల్లేరు వాగు ఉధృతికి సుమారు రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

గుంటూరు జిల్లా రేపల్లె, అమృతలూరు, గుంటూరు, మంగళగిరి, నిజాంపట్నం, పొన్నూరు, తాడేపల్లి, తాడికొండ, పెదకాకాని, నగరం, పిట్టలవానిపాలెం, తదితర మండలాల్లో భారీ వర్షం పడింది. జిల్లాలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు రేపల్లె మండలంలో అత్యధికంగా 85.5 మిల్లీమీటర్లు, అమృతలూరు మండలంలో 52 మి.మీ, మంగళగిరిలో 46.75 మి.మీ, నిజాంపట్నంలో 46 మి.మీల వర్షపాతం నమోదైంది. ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు పొలాల్లో తాటి చెట్టుపై పిడుగు పడటంతో మంటలు చెలరేగి చెట్టు నిలువునా కాలిపోయింది. గుంటూరు నగరంలో రోడ్లపై నీటితో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. తాడికొండ నియోజకవర్గం పరిధిలో చీకటి వాగు, ఎర్రవాగు, నక్కవాగు, కోటేళ్ల వాగు, కొండవీటి వాగులు పొంగిపొర్లాయి. సమీపంలోని పంట పొలాల్లో వరద నీరు చేరింది. పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గుంటూరు–తుళ్లూరుల మ«ధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తాడేపల్లిలోని పలు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది.  

మరిన్ని వార్తలు