నేడు, రేపు మోస్తరు వర్షాలు

17 Oct, 2021 03:03 IST|Sakshi

27న అల్పపీడనం ఏర్పడే అవకాశం

సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం మీదుగా ఛత్తీస్‌గఢ్‌ వైపు కదులుతోంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. అదేవిధంగా అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తూర్పు, పశ్చిమ ద్రోణి సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది.

గడచిన 24 గంటల్లో గొల్లప్రోలులో 114.25, కొత్తపల్లిలో 102.25, వాకతిప్పలో 90, హరిపురంలో 87, రాజాంలో 76.75, టెక్కలిలో 67.7, గోపాలపురంలో 62, వేపాడలో 55.7, తునిలో 55.5, కొయ్యూరులో 51, తిరుపతిలో 49.2, మెరకముడిద్దాంలో 48.25 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. 

27న మరో అల్పపీడనం
ఈ నెల 27న వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇది కాకినాడ, విశాఖపట్నం లేదా పూరీ ప్రాంతంలో తీరం దాటే సూచనలున్నాయని భావిస్తున్నారు. ఒకవేళ దిశను మార్చుకుంటే తమిళనాడు వైపుగా పయనించే అవకాశాలున్నాయని వెల్లడించారు.

తిరుపతిలో భారీ వర్షం
తిరుపతితుడా(చిత్తూరు జిల్లా): తిరుపతిలో శనివారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 2  గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఎడతెరపిలేని వర్షం పడటంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలువలు పొంగి ప్రవహించాయి. దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి. 

మరిన్ని వార్తలు