రెండ్రోజులు కోస్తాంధ్రకు వర్ష సూచన 

6 Nov, 2021 03:47 IST|Sakshi
మినుములూరు కాఫీ బోర్డు కార్యాలయం వద్ద దట్టంగా కురుస్తున్న పొగమంచు

ఈ ఏడాది బెజవాడలో రికార్డుస్థాయి వర్షపాతం 

ఈ నెల 12న అల్పపీడనం 

విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం 

సాక్షి, విశాఖపట్నం/పాడేరు: పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి సమీపంలో తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.1 కి.మీ. ఎత్తు వరకు విస్తరించింది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో స్వల్ప అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా బలహీనపడి నెల్లూరు, తమిళనాడు వైపుగా ప్రయాణించే సూచనలు కనిపిస్తున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో శని, ఆదివారాల్లో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని వివరించారు. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపారు. రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నెల 12న దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని, దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు ఈ నెల 13 నుంచి మొదలయ్యే సూచనలున్నాయని వెల్లడించారు.  

విజయవాడలో అత్యధిక వర్షపాతం 
2021లో అత్యధిక వర్షపాతం నమోదైన నగరంగా విజయవాడ రికార్డు సృష్టించింది. తర్వాత స్థానంలో కడప ఉండటం విశేషం. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షపాత వివరాల్ని పరిశీలిస్తే.. విజయవాడలో అత్యధికంగా 1,548 మి.మీ. వర్షపాతం నమోదైంది. కడపలో 1,342, విజయనగరంలో 1,331 మి.మీ. వర్షం కురిసింది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన నగరాల జాబితాలో అట్టడుగున నెల్లూరు 440 మి.మీ. వర్షపాతంతో ఉండగా, కర్నూలులో 461, కావలిలో 552, ఒంగోలులో 698 మి.మీ. వర్షపాతం నమోదైంది. 

పడిపోతున్న ఉష్ణోగ్రతలు 
విశాఖ ఏజెన్సీలో చలిగాలులు ప్రారంభమయ్యాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. పొగమంచు దట్టంగా కురుస్తోంది. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం సూర్యోదయం అయ్యే వరకు చలి తీవ్రత నెలకొంది. అతిశీతల ప్రాంతాలుగా గుర్తింపు పొందిన కాఫీ తోటల ఏరియాల్లో మాత్రం చలిగాలులు అధికంగా వీస్తున్నాయి. పాడేరుకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అతిశీతల ప్రాంతం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డు వద్ద ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ నెల 3న 17 డిగ్రీలు, 4వ తేదీన 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, శుక్రవారం ఉదయం 10 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శుక్రవారం 14.4, అరకులోయ కేంద్ర కాఫీ బోర్డు కార్యాలయంలో 18.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.   

మరిన్ని వార్తలు