ఈదురుగాలులు, వర్షాలు

24 Apr, 2021 05:02 IST|Sakshi
కర్నూలులో భారీ వర్షానికి వ్యాపారుల ఇక్కట్లు

పిడుగులు పడి ఐదుగురి మృత్యువాత

నేలరాలిన మామిడి కాయలు

కళ్లాల్లో తడిసిన మిర్చి, ధాన్యం

సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ)/నెట్‌వర్క్‌: రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో వర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులు పడి ఐదుగురు మృతిచెందారు. ఈ గాలులు, వర్షాలు రైతులకు తీవ్ర నష్టం కలిగించాయి. పలుచోట్ల చెట్లు విరిగి పడటంతో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. పిడుగులు పడి శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతిచెందారు. కర్నూలు జిల్లాలో మృతిచెందిన వ్యక్తి వైఎస్సార్‌ జిల్లాకు చెందినవారు. గాలులు, వర్షాల కారణంగా కర్నూలు జిల్లాలోని మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. గుంటూరు జిల్లాలో కళ్లాల్లో మిర్చి, ధాన్యం తడిసిపోయాయి. నెల్లూరు జిల్లాలో పసుపు పంట దెబ్బతింది. గుంటూరు జిల్లాలో గురువారం రాత్రి పలుచోట్ల వర్షం కురిసింది. చింతలచెర్వు గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయ ధ్వజస్తంభం పీఠ భాగం పిడుగుపాటుకు దెబ్బతింది. తిరుమలలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రెండుగంటల పాటు వర్షం కురిసింది. పిడుగుల శబ్దాలతో కొండలు ప్రతిధ్వనించాయి. శ్రీవారిని దర్శించుకుని బయటకు వస్తున్న భక్తులు వర్షం కారణంగా గదులకు చేరుకునేందుకు ఇబ్బందిపడ్డారు. శ్రీవారి ఆలయం ఎదుట, మాడ వీధులు, బయట రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. 

రెండురోజుల పాటు వర్షాలు
దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం, అమరావతిల్లోని వాతావరణ కేంద్రాలు తెలిపాయి. రానున్న 48 గంటల పాటు దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శుక్రవారం అనంతపురం జిల్లా తనకల్లులో 5 సెంటీమీటర్లు, ఉరవకొండలో 4, కదిరిలో 2, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో 3, గుంటూరు జిల్లా జంగమేశ్వరపురం, ప్రకాశం జిల్లా దర్శి, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం, తాడేపల్లిగూడెంలలో ఒక సెంటిమీటరు వంతున వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో అత్యధికంగా అనంతపురంలో 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో పలుచోట్ల శనివారం పిడుగులతో పాటు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తులశాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. 

>
మరిన్ని వార్తలు