రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

17 Apr, 2022 04:24 IST|Sakshi

ఉపరితల ఆవర్తన ప్రభావం

సాక్షి, అమరావతి: వచ్చే రెండు రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ వరకు కర్ణాటక మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దాని ప్రభావంతో ఆదివారం, సోమవారం వర్షాలు కురుస్తాయని వివరించింది. ఆదివారం ప్రకాశం, కర్నూలు, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆది, సోమవారాల్లో విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, వివరించారు.

మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల జల్లులు పడతాయని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. పగటిపూట మామూలు వాతావరణమే ఉండి సాయంత్రానికి వర్షాలు పడతాయని, ఉష్ణోగ్రతలు యధావిధిగా కొనసాగే పరిస్థితి ఉందని వివరించారు. కాగా, రాష్ట్రంలో పగటిపూట 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రిపూట కూడా సాధారణంగా కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. మూడు రోజుల తర్వాత నుంచి ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.

పిడుగుపడి బాలుడి మృతి 
మంత్రాలయం రూరల్‌: పిడుగుపాటుకు గురై ఓ బాలుడు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రచ్చమర్రిలో శనివారం చోటుచేసుకుంది. రచ్చమర్రికి చెందిన వేమన్న, నాగమ్మ దంపతుల ద్వితీయ కుమారుడు హరిజన సురేష్‌ (12) తాత జానయ్య దగ్గర ఉంటూ స్థానిక పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. బాలుడు శనివారం తాతయ్యతో కలిసి పొలానికి వెళ్లాడు. ఆ సమయంలో పిడుగుపడటంతో సురేష్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. తాత జానయ్య దూరంగా ఉండటంతో పిడుగు నుంచి తప్పించుకున్నాడు. 

మరిన్ని వార్తలు