నెలాఖరు నుంచి వర్షాలు!

29 May, 2021 04:14 IST|Sakshi

తగ్గనున్న ఎండలు

పలు ప్రాంతాలకు వర్ష సూచన

సాక్షి, విశాఖపట్నం/సాక్షి అమరావతి: మండుతున్న ఎండలు, వడగాడ్పులతో గత మూడు రోజులుగా తల్లడిల్లుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు చల్లని కబురు చెప్పారు. అరేబియా సముద్రం నుంచి గాలులు నేరుగా వీస్తుండటంతో ఈ నెలాఖరు నుంచి వర్షాలు పడతాయని వెల్లడించారు. శనివారమూ ఎండలు, వడగాడ్పులు ఉంటాయని, ఆదివారం నుంచి వాతావరణం చల్లబడుతుందని, పలు చోట్ల వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశాల నుంచి మేఘాలు ఉత్తరాంధ్ర వైపు రావడంతో జూన్‌ మొదటి వారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. నైరుతి రుతుపవనాలు జూన్‌ 5 నాటికి రాష్ట్రాన్ని తాకుతాయని వివరించారు. 

మూడో రోజూ భానుడు భగభగ
రాష్ట్రంలో వరుసగా మూడో రోజూ శుక్రవారం కూడా భానుడు భగ్గుమన్నాడు. వడగాడ్పులు విజృంభించాయి. అనేక ప్రాంతాల్లో 40 నుంచి 44 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎండలు మంటలు పుట్టించాయి. శనివారం కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వడగాలులు వీచే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు