కొనసాగుతున్న వర్షాలు 

12 Oct, 2022 05:24 IST|Sakshi
విజయవాడ నగరంలో జోరున కురుస్తున్న వర్షం

శ్రీశైలానికి 1.28లక్షల క్యూసెక్కుల వరద 

సాక్షి నెట్‌వర్క్‌ : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కూడా వర్షాలు కురిశాయి. ఎన్టీఆర్‌ జిల్లాలోని విజయవాడ ఈస్ట్‌ మండలంలో అత్యధికంగా 30.2 మి.మీ. సెంట్రల్, నార్త్, వెస్ట్‌ మండలాల్లో 29.6 మి.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైంది. అలాగే, విజయవాడ రూరల్‌లో 25.2మి.మీ. వర్షం కురిసింది. కృష్ణా జిల్లాలో 9.2.మి.మీ. సగటు వర్ష పాతం నమోదైంది.

అత్యధికంగా బంటుమిల్లిలో 27.2మి.మీ, అత్యల్పంగా ఉయ్యూరులో 1.8మి.మీ కురిసింది. అనంతపురం జిల్లాలోని 15 మండలాల్లో వర్షం కురిసింది. కుందుర్పిలో 60.2 మి.మీ., ఆత్మకూరులో 50.2 మి.మీ మేర భారీ వర్షం కురిసింది. కంబదూరు 37 మి.మీ, కూడేరు 32.2 మి.మీ, రాప్తాడు 20.2 మి.మీ. వర్షం కురిసింది.   

శ్రీశైలానికి పెరుగుతున్న వరద 
మరోవైపు.. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం పెరుగుతోంది. సోమవారం సాయంత్రానికి లక్షా 9 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా మంగళవారం సాయంత్రానికి జూరాల, సుంకేసుల నుంచి 1,28,106 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. రెండు గేట్లను 10 అడుగుల మేర తెరచి 55,874 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.

బ్యాక్‌వాటర్‌ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 3 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 338 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. జలాశయంలో 213.8824 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్‌ నీటిమట్టం 884.70 అడుగులకు చేరుకుంది. అలాగే, సాగర్‌ జలాశయం నుంచి 10 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 80,690 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు