దూసుకొస్తున్న ‘అసని’ తుపాను 

8 May, 2022 03:34 IST|Sakshi

10న శ్రీకాకుళం–ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం 

తీవ్రత పెద్దగా ఉండదంటున్న వాతావరణ శాఖ 

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు 

సాక్షి, అమరావతి: దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది వాయవ్య దిశగా వేగంగా కదులుతూ ఆదివారం ఉదయానికి తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తుపానుగా మారితే దీనికి ‘అసని’గా నామకరణం చేయనున్నారు. ఇది శ్రీకాకుళం–ఒడిశా తీరం మధ్య ఈ నెల 10వ తేదీన తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం అంత తీవ్రంగా ఉండదని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో అనేక చోట్ల వర్షాలు పడతాయని, గంటకు 30 నుంచి 40  కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో పలుచోట్ల ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. కాగా, దీని ప్రభావంతో శనివారం విశాఖ, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉన్నా ఆ తర్వాత వాతావరణం చల్లబడింది. 

పిడుగులు పడి ముగ్గురు దుర్మరణం 
ఆమదాలవలస రూరల్, సరుబుజ్జిలి: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం నెల్లిపర్తి, బూర్జ మండలం పణుకుపర్త గ్రామాల్లో శనివారం పిడుగులు పడి ముగ్గురు మృతి చెందారు. నెల్లిపర్తిలో గరికపాటి ఏకాశి (52), పొదిలాపు చిన్నలక్ష్మి (39) కంసాల చెరువులో ఉపాధి పనులు చేస్తుండగా పిడుగుపడింది. దీంతో ఇద్దరూ ఉన్నచోటే కుప్పకూలిపోయారు.

సహచరులు వారిద్దరినీ ఇంటికి తీసుకెళ్లగా అప్పటికే ప్రాణాలుపోయాయి. బూర్జ మండలం పణుకుపర్తలో పశువుల్ని మేపేందుకు వెళ్లిన కొండ్రోతు మేఘన (12) అనే బాలిక ఉరుములు, మెరుపులు రావడంతో తోటివారితో కలిసి ఓ చెట్టు కిందకు వెళ్లింది. అక్కడే పిడుగు పడటంతో అపస్మారక స్థితికి చేరింది. ఆమెతో పాటు ఉన్న మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు వీరందరినీ పాలకొండ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ మేఘన చనిపోయింది.   

మరిన్ని వార్తలు