గోరుముద్దకు మరింత అండ

3 Nov, 2022 16:31 IST|Sakshi

కుక్, హెల్పర్లకు నిర్వహణ నిధుల పెంపు

ఏలూరు, పశ్చిమలో నెలకు అదనంగా రూ.76.93 లక్షల ఖర్చు

మూడేళ్లలో రెండోసారి పెంచిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): బడిలో మధ్యాహ్న భోజనం మానేసిన రోజుల నుంచి ఎప్పుడెప్పుడు భోజనం టైమవుతుందా.. ఈ రోజు కిచిడీ లేదా ఫ్రైడ్‌రైస్‌ తినొచ్చు అంటూ విద్యార్థులు ఎదురు చూసే రోజులు వచ్చాయి. ముఖ్యమంత్రిగా జగన్‌ బాధ్యతలు తీసుకున్న నాటి విద్యారంగంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించిన విషయం తెలిసిందే. కేవలం అమ్మ ఒడి, నాడు – నేడు వంటి పథకాలు మాత్రమే విద్యార్థులకు కడుపు నింపవని గుర్తించిన ముఖ్యమంత్రి విద్యార్థులు ఇష్టంగా భోజనం చేసేలా ఏర్పాటు చేయాలని భావించారు. గత ప్రభుత్వాలు కేవలం పప్పు, సాంబారులతో సరిపెట్టారు. చిన్నారుల ఆకలిబాధను గుర్తించిన జగన్‌ మామ వారందరికీ శుభవార్త చెప్పారు. దాని ఫలితమే కిచిడీ, ఫ్రైడ్‌ రైస్, పులిహోర వంటి వాటితో పాటు కోడిగడ్లు, చిక్కీలు మెనూలో చేరాయి. దీనితో గతంలో బడిలో మధ్యాహ్న భోజనం మానివేసిన విద్యార్థులు సైతం ఇప్పుడు ఇష్టంగా తింటున్నారు.  

పెరిగిన ధరలకు అనుగుణంగా నిధుల పెంపు 
విద్యార్థులకు రుచి, శుచికరమైన ఆహారం అందించడానికి నాణ్యమైన నిత్యావసరాలు, బియ్యం వంటివి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. నాణ్యమైన వస్తువులు కొనాలంటే కుక్, హెల్పర్‌లకు ప్రస్తుతం ఇస్తున్న నిర్వహణ నిధులు సరిపోవడం లేదని ముఖ్యమంత్రి గ్రహించారు. కుక్, హెల్పర్లు మనస్ఫూర్తిగా పని చేయాలంటే వారికి తగిన ఆదాయం కల్పించాల్సి ఉంటుందని భావించిన ముఖ్యమంత్రి వారికి నిర్వహణ నిధులు పెంచుతూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు. పెరుగుతున్న కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు, కోడిగుడ్ల ధరలను దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేలా నిధులు పెంచారు.  

అదనంగా నెలకు రూ.76.93 లక్షలు చెల్లింపు 
ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే కుక్, హెల్పర్‌లు దాదాపు 6 వేల మంది వరకూ ఉన్నారు. ఏలూరు జిల్లాలో 1824 పాఠశాలలు ఉండగా 1,50,654 మందికి మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 1413 పాఠశాలలు ఉండగా 1,09,153 మంది విద్యార్థులకు వండి వడ్డిస్తున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తయారు చేసేందుకు ప్రభుత్వం కుక్, హెల్పర్లకు గతంలో ప్రాథమిక స్థాయి విద్యార్థులు ఒక్కొక్కరికీ రూ. 4.97 చెల్లించేది.

ప్రస్తుతం ఆ ధరను రూ.5.88కి పెంచింది. అంటే ఒక్కొక్క విద్యార్థికి 91 పైసలు పెంచింది. ప్రాథమికోన్నత, ఉన్నత తరగతుల విద్యార్థులకు రూ.7.45 చెల్లించేది. ప్రస్తుతం ఆ ధరను రూ. 8.57కు పెంచడంతో ఒక్కొక్క విద్యార్థిపై కుక్, హెల్పర్‌లకు రూ.1.12 లబ్ది చేకూరుతోంది. ఈ మేరకు ఏలూరు జిల్లాలోని అందరు విద్యార్థులపై రోజుకు రూ. 1,48,857 అదనంగా లభిస్తుండగా పశ్చిమ గోదావరి జిల్లాలోని రూ. 1,07,599 లభిస్తోంది. అంటే నెలకు రూ. 76.93 లక్షలను ప్రభుత్వం కుక్, హెల్పర్లకు అదనంగా చెల్లిస్తోంది. 

మధ్యాహ్న భోజనం మెనూ ఇలా.. 
విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో ఏ పదార్థాలు వడ్డించాలో ప్రభుత్వం నిర్ధేశించింది. ఈ మేరకు సోమవారం అన్నం, కోడిగుడ్డు కూర, పప్పుచారు, చిక్కీ, మంగళవారం పులిహోర, టమోట పప్పు, ఉడకబెట్టిన గుడ్డు, బుధవారం వెజిటబుల్‌ రైస్‌(ఫ్రైడ్‌రైస్‌), ఆలూ కుర్మా, ఉడకబెట్టిన గుడ్డు, చిక్కీ, గురువారం కిచిడీ, టమాటా చట్నీ, ఉడకబెట్టిన గుడ్డు, శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడకబెట్టిన గుడ్డు, శనివారం అన్నం, సాంబారు, తీపి పొంగలి వడ్డిస్తున్నారు. 

సంతోషంగా ఉన్నారు 
ప్రభుత్వం కుక్, హెల్పర్లకు నిర్వహణ నిధులను పెంచడంతో వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన పదార్థాలను, రుచి, శుచికరంగా వండి వడ్డిస్తున్నారు. ప్రతి పాఠశాలలో మా అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు మధ్యాహ్న భోజనం జరుగుతున్న తీరును పర్యవేక్షిస్తున్నారు. ఏజెన్సీలకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటుండడంతో వారికి ఆర్థికంగా ఉపయోగకరంగా ఉంటోంది. 
-ఆర్‌ఎస్‌ గంగాభవాని, జిల్లా విద్యాశాఖాధికారి, ఏలూరు జిల్లా

మరిన్ని వార్తలు