నలుగురు ప్రధానులకు రక్షకుడిగా ‘మిస్టర్‌ ఆంధ్ర’ రాజగోపాల్‌ 

3 Apr, 2022 10:27 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రతి యువకుడికి తండ్రే తన మొదటి హీరో. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన వాసంశెట్టి రాజగోపాల్‌ కూడా తన తండ్రి స్ఫూర్తితో పోలీస్‌ శాఖలో చేరారు. నలుగురు ప్రధానులకు అంగరక్షక బృందంలో పనిచేసిన రికార్డు సొంతం చేసుకున్న వ్యక్తిగా రాష్ట్రం నుంచి రాజగోపాల్‌ ఒకే ఒక్కడు కావడం విశేషం. రాజగోపాల్‌ తండ్రి సత్తిరాజు ఆంగ్లేయుల కాలం(1930 ప్రాంతం)లో ఎస్సైగా పనిచేస్తే.. రాజగోపాల్‌ 1984లో పోలీస్‌ శాఖలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా చేరారు. 

రెండేళ్లకే ఎస్పీజీలో అవకాశం 
రాజగోపాల్‌కు వృత్తిలో చేరిన రెండేళ్లకే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్‌పీజీ)లో పనిచేసే అవకాశం దక్కింది. ప్రధానులకు అంగరక్షకులుగా ఉండే ఎస్‌పీజీలో 1986లో చేరారు. ఏడాదిపాటు కఠిన శిక్షణ అనంతరం 1987లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ వద్ద ఎస్‌పీజీలో ఉండే 10 మంది రక్షకుల్లో ఒకరిగా చేరారు. వరుసగా ప్రధానులుగా పనిచేసిన విశ్వనాథ ప్రతాప్‌సింగ్, చంద్రశేఖర్, పీవీ నరసింహరావు వద్ద రక్షకుడిగా ఉంటూ వారితో శభాష్‌ అనిపించుకున్నారు. 1992లో తిరిగి రాష్ట్ర పోలీస్‌ విభాగానికి వచ్చిన ఆయన ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పనిచేశారు. ఇటీవల రాజమండ్రిలో ఏఎస్పీగా పదవీ విరమణ చేశారు.  

సేవల్లోనూ మేటి 
పోలీస్‌గా ఎక్కడ విధులు నిర్వహించినా ఆయన సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. భీమవరం రూరల్‌ ఎస్సైగా పనిచేసిన కాలంలో కాళీపట్నం గ్రామానికి చెందిన జయరాజు అనేవ్యక్తిని పాము కరవగా.. అత్యవసరంగా జయరాజుకు రక్తం కావాలని వైద్యులు చెప్పడంతో రాజగోపాల్‌ రక్తదానం చేసి ప్రాణాన్ని కాపాడారు. తణుకులో రోడ్డు ప్రమాదానికి గురైన ఆటో డ్రైవర్‌కు అధిక రక్తస్రావంతో ప్రాణాపాయంలో ఉంటే రాజగోపాల్‌ రక్తదానం చేసి కాపాడారు. నిడదవోలు, తణుకు సీఐగా పనిచేసిన సమయంలోనూ విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ, వృద్ధాశ్రమాలకు ఆర్థిక సాయం అందించి ఆదర్శంగా నిలిచారు. రాజగోపాల్‌కు  70కి పైగా రివార్డులు, అవార్డులు దక్కాయి.

మిస్టర్‌ ఆంధ్రా 
రాజగోపాల్‌ విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదివారు. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌కు తొలినుంచీ ప్రాధాన్యత ఇచ్చే రాజగోపాల్‌ శరీర సౌష్టవ (బాడీ బిల్డింగ్‌)లో 1979 నుంచి 1982 వరకు మూడేళ్లపాటు వరుసగా మిస్టర్‌ ఆంధ్రాగా కొనసాగడం విశేషం.  

సంతృప్తిగా ఉంది..
పోలీస్‌ శాఖలో బాధ్యతలు నిర్వర్తించినందుకు సంతృప్తిగా ఉంది. నలుగురు ప్రధానులకు రక్షకుడిగా పనిచేసే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. మా నాన్న సత్తిరాజు స్ఫూర్తితో పోలీస్‌ అయిన నేను విధి నిర్వహణలో సంతృప్తికరంగా పనిచేశాను. ప్రస్తుతం రాజమండ్రిలో వ్యవసాయం, తోటల పెంపకం వంటి వ్యాపకాలను పెట్టుకున్నాను. ఇకపై  సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటాను. 
– వి.రాజగోపాల్, రిటైర్డ్‌ ఏఎస్పీ
 

మరిన్ని వార్తలు