గంటా సన్నిహితుడి మిత్రుడు అదృశ్యం

6 Aug, 2022 07:50 IST|Sakshi
రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై ఉన్న కాట్రగడ్డ చంద్రశేఖర్‌ కారు

ఆర్థిక ఇబ్బందులతో గోదావరిలో దూకి విశాఖ వాసి ఆత్మహత్య?

రాజమహేంద్రవరం బ్రిడ్జి వద్ద కారుపై లేఖ లభ్యం

దొండపర్తి (విశాఖ దక్షిణ), కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖ రాసి రాజమహేంద్రవరంలోని రోడ్డు కమ్‌ రైలు బ్రిడ్జి వద్ద శుక్రవారం ఓ వ్యక్తి అదృశ్యం కావడం కలకలం రేపింది. విశాఖ కిర్లంపూడి లేఅవుట్‌ ప్రాంతానికి చెందిన కాట్రగడ్డ చంద్రశేఖర్‌ (60) గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అక్కడున్న క్రేటా కారు (ఏపీ 39 ఈక్యూ 9999) వద్ద ఓ లేఖ లభ్యమైంది.
చదవండి: అత్తపై కోడలు భారీ స్కెచ్‌.. విస్తుపోయే షాకింగ్‌ నిజాలు బట్టబయలు

ఆయన గోదావరిలో దూకి చనిపోయాడా? లేక ఎక్కడికైనా వెళ్లిపోయాడా? అనే విషయంపై స్పష్టత రాలేదు. ఉదయం అటుగా వెళ్తున్న కానిస్టేబుల్‌ కారు ఆగి ఉండటాన్ని గుర్తించి స్టేషన్‌కు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడకు చేరుకుని పరిసర ప్రాంతాలు, గోదావరిలో గాలింపు చేపట్టినా ఆచూకీ దొరకలేదు.

రూ.12 కోట్లకుపైగా అప్పుల్లో కూరుకుపోయి..
విశాఖ మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కిర్లంపూడి లేఅవుట్‌ ‘ది పామ్స్‌’ అపార్ట్‌మెంట్‌లో చంద్రశేఖర్‌ కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సన్నిహితుడు, ఇటీవల చనిపోయిన నలంద కిషోర్‌కు ఆయన స్నేహితుడని తెలుస్తోంది. చంద్రశేఖర్‌ సుమారు రూ.12 కోట్ల అప్పుల్లో కూరుకుపోయినట్లు సమాచారం. ఇందులో రూ.6 కోట్లు మధ్యవర్తిగా ఇతరులకు ఇప్పించి ఇరుక్కుపోయినట్లు చెబుతున్నారు. బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. చంద్రశేఖర్‌ అదృశ్యంపై ఇప్పటివరకు పోలీసులకు ఫిర్యాదు అందలేదు. ఆయన నివాసంలో ప్రస్తుతం ఎవరూ లేరని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు