Rajahmundry Tourist Places: రాజమండ్రి చూసొద్దామా?

16 Oct, 2022 09:28 IST|Sakshi

చారిత్రక నగరమైన రాజమండ్రి టూరిజం హబ్‌గా మారుతోంది. పవిత్ర గోదావరి తీరాన వెలసిన రాజమండ్రిలో రివర్ టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసేందుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. రాజమండ్రి నగరంతోపాటు సమీపంలో గోదావరి పాయల మధ్య ఉన్న పిచ్చుకలంక, ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి కనపరుస్తున్నాయి.  పవిత్ర పుణ్యక్షేత్రాలు, ఆకట్టుకునే మ్యూజియంలు, పురాతన కట్టడాలు, పాపికొండల టూరిజం వంటి సదుపాయలతో  ఉన్న రాజమండ్రి నగరాన్ని టూరిజం హబ్ గా రూపొందించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారు. 

ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లాలో భాగమైన రాజమండ్రి, కాకినాడ, కోనసీమ, ఏజెన్సీలలో ఎన్నో అందమైన, ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలచిన ప్రదేశాలు ఉన్నాయి. నదీతీరంలో వెలసిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అద్భుతమైన అందాలకు చారిత్రక ఇతిహాసాలకు కొలువైన  ఈ ప్రాంతాన్ని  పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పథకాలు సిద్దం చేసింది.  

రాజమండ్రి నగరం కేంద్రంగా రివర్, టెంపుల్ టూరిజం అభివృద్ధి పై ప్రభుత్వం దృష్టిసారించింది. దీనిలో భాగంగా రాజమండ్రి నగరంలో గోదావరిపై 122 ఏళ్ల క్రితం నిర్మించిన హ్యావలాక్ వంతెనను అభివృద్ధి చేసి, టూరిజం స్పాట్ గా మార్చాలని భావిస్తోంది. దీనికి తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ వంతెనను వెడల్పు చేసి, వాకింగ్ ట్రాక్ తోపాటు, షాపింగ్ స్ట్రీట్ గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గోదావరి నదిపై ఉన్న వంతెనను  తీర్చిదిద్దితే దేశంలోనే పురాతనమైన గోదావరి వంతెన ప్రత్యేక గుర్తింపు పొందుతుంది

రాష్ట్రంలో పాపికొండల టూరిజం ఇప్పటికే ఎంతో గుర్తింపు పొందింది. రాజమండ్రి నగరం కేంద్రంగానే పాపికొండల బోట్ల నిర్వహణ జరుగుతుంది. దేశంలో వివిధ ప్రాంతాలనుంచి వచ్చే టూరిస్టులు రాజమండ్రికి వచ్చి,ఇక్కడినుంచి దేవీపట్నం వద్ద బోట్లు ఎక్కి పాపికొండల యాత్రకు వెళతారు. ఇపుడు యాత్రికులు బసచేయడానికి ఏర్పాట్లు చేయడం,అదే విధంగా స్థానికంగా రివర్ బేస్డ్ రెస్టారెంట్లు ఏర్పాటు చేయడం ద్వారా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఏపీ టూరిజం డెవలెప్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఇప్పటికే హరిత, అర్ధర్ కాటన్ బోట్లుతోపాటు మరో పది ప్రైవేట్ బోట్లు  పాపికొండలకు వెళ్లి వస్తున్నాయి. వీటి సంఖ్యను మరింత పెంచి, మరికొన్ని బోట్లకు అనుమతివ్వడంతోపాటు పాపికొండల టూరిజాన్ని మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 

రాజమండ్రికి సమీపంలో ధవళేశ్వరం వద్ద గోదావరి పాయల మధ్య ఉన్న పిచ్చుక లంక పర్యాటకంగా అత్యంత అనువైన ప్రాంతంగా గుర్తించారు. దాదాపు 57 ఎకరాలున్న ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేయడానికి గతంలోనే ఎత్తు చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో హోటల్ రంగంలో ప్రఖ్యాతి చెందిన ఓబెరాయ్ గ్రూపు ఇక్కడ హోటల్స్, రిసార్టులు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. దీంతో ఈ ప్రాంతంలో పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి విస్తృతమైన అవకాశాలు ఏర్పడ్డాయి. 

రాజమండ్రి వచ్చే పర్యాటకులకు ఓవైపు ఆహ్లాదాన్నిచ్చే గోదావరిపై ఉన్న వంతెనలు, ఘాట్లు, వాటిలో ఉన్న పవిత్ర దేవాలయాలతోపాటు చారిత్రిక కట్టడాలు కూడా కనపడతాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవలసినవి గోదావరి పై ధవళేశ్వరంలో కాటన్ మహాశయుడు నిర్మించిన ఆనకట్ట దానితోపాటు ఆయన పేరిట ఏర్పాటు చేసిన కాటన్ మ్యూజియం. రాజమండ్రికి రోడ్డు, రైలు మార్గాలతోపాటు ఎయిర్ కనెక్టివిటీ కూడా ఉండటంతో సుదూర ప్రాంతాలనుంచి సైతం పర్యాటకలు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎయిర్ పోర్టు నుంచి నేరుగా నగరంలోకి వచ్చే మార్గాన్ని సైతం ఇప్పటికే సుందరంగా తీర్చిదిద్దారు. రాజమండ్రికి సమీపంలోనే వాడపల్లి, ద్రాక్షారామ, అయినవిల్లి, అన్నవరం వంటి పుణ్యక్షేత్రాలు కూడా ఉండటం, రాజమండ్రి నగరంలో కూడా అనేక దేవాలయాలు, ఘాట్లు, ఉండటంతో టెంపుల్ టూరిజం అభివృద్ధి చెందేందుకు మార్గం సుగమమైంది. 

మరిన్ని వార్తలు