వెదురుతో ఆదరువు.. చేతిపనికి సాంకేతికత జోడింపు

9 Jan, 2023 17:49 IST|Sakshi

రాజాం జీఎంఆర్‌ఐటీ ఆధ్వర్యంలో శిక్షణ

ఏడాది కాలంగా తర్ఫీదు

వెదురుకర్రలతో బుట్టలు, పెన్‌స్టాండ్స్, ఫ్లవర్‌ బొకేల తయారీ

రాజాం (విజయనగరం జిల్లా): వెదురుకర్రతో తయారు చేసిన బుట్టలు అందరికీ తెలిసినవే. వెదురు కర్ర తట్టల గురించి చెప్పనక్కర్లేదు. సాధారణంగా ఇవన్నీ ఎప్పటినుంచే గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్న వస్తుసామాగ్రే. అయితే వాటికి భిన్నంగా ఇదే ముడిసరుకుతో మరెన్నో వస్తువులు కూడా తయారుచేసి ఇంట్లో అందంగా అలంకరించుకోవచ్చు. స్నేహితులకు బహుమతిగా ఇవ్వొచ్చు. కాస్తా సాంకేతికత తోడైతే చాలు ఇదే వెదురుకర్ర ఎన్నో అధ్బుతాలు సృష్టిస్తుందని రాజాం పట్టణానికి చెందిన జీఎంఆర్‌ఐటీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం నిరూపిస్తోంది. గత ఏడాది కాలంగా రాజాం చుట్టపక్కల గ్రామాలకు చెందిన వెదురుపనివారికి వెదురుతో తయారు చేసే అందమైన వస్తుసామగ్రిపై శిక్షణ ఇస్తున్నారు.   


ప్లాస్టిక్‌ నిషేధమే లక్ష్యంగా.. 

న్యూఢిల్లీకి చెందిన సైన్స్‌ ఫర్‌ ఈక్యూటీ ఎంపవర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ డివిజన్‌ (సీడ్‌)  ప్లాస్టిక్‌ నిషేధానికి చర్యలు ప్రారంభించింది.  ప్రజలు వినియోగించే నిత్యావసర వస్తుసామగ్రిలో కొన్నింటిని ప్లాస్టిక్‌ నుంచి దూరంచేసేందుకు చేతితో తయారీచేసే వస్తుసామగ్రిపై దృష్టిసారించింది. ఓ వైపు ప్లాస్టిక్‌ను నివారించేందుకు వెదురుపుల్లలతో తయారుచేసే వస్తుసామగ్రిని ప్రోత్సహించడం, మరో వైపు వాటిని తయారీచేసే కులవృత్తుల చేతిపనివారికి సాంకేతికత అందించి వారి జీవన నైపుణ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా చేసుకుంది.  దేశంలోని పలు ఐటీ కళాశాలల్లో  చేతి వృత్తుల వారికి సాంకేతిక నైపుణ్యాలు అందించే కార్యక్రమాలు చేపట్టగా రాజాంలోని జీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏడాది క్రితం ఒక ప్రాజెక్ట్‌ ప్రారంభించింది. వెదురుకర్రలు, పుల్లలతో తయారయ్యే వస్తుసామగ్రిని మరింత అందంగా తయారీచేసే విధానాన్ని చేతిపనివారికి నేర్పుతోంది.     


శిక్షణకు విశేష ఆదరణ 

జీఎంఆర్‌ఐటీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో జరుగుతున్న సాంకేతిక శిక్షణకు విశేష ఆదరణ కనిపిస్తోంది. ప్రస్తుతం రాజాం, సంతకవిటి, రేగిడి, జి.సిగడాం తదితర మండలాలకు చెందిన వెదురుపనివారు ఈ శిక్షణ వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకూ 150 మంది శిక్షణ పొందారు. ఒక వ్యక్తికి 25 రోజులు శిక్షణ ఇస్తుండగా, శిక్షణ సమయంలో రోజుకు రూ. 200లు స్టైపెండ్‌ ఇస్తున్నారు. శిక్షణ బాగా సద్వినియోగం చేసుకున్నవారు సొంతంగా మెషీన్లు కొనుగోలుచేసేవిధంగా బ్యాంకు రుణాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ శిక్షణను పూర్తిగా వెదురుపని తెలిసిన శిక్షకుల ద్వారా ఇప్పించడంతో పాటు శిక్షణలో మెలకువలు నేర్చుకుని, బాగా వస్తుసామగ్రి తయారు చేస్తున్నవారితో కూడా కొత్తవారికి శిక్షణ ఇప్పిస్తున్నారు.


సీడ్‌ ప్రాజెక్ట్‌లో బాగంగా తయారీచేస్తున్న వెదురు వస్తుసామగ్రి చాలా అందంగా, అపురూపంగా దర్శనమిస్తోంది. టీ, కాఫీ కప్పులు, ట్రేలు, సజ్జలు, ఫ్లవర్‌ బొకేలు, కూజాలు, దుస్తులు పెట్టే తొట్టెలు, చిన్నారుల ఊయల తొట్టెలు, పెన్నుల స్టాండ్‌లు, బట్టల స్టాండ్‌లు ఇలా వినూత్న వస్తుసామాగ్రి రూపొందుతోంది. ఇవన్నీ ప్లాస్టిక్‌ రహిత వస్తుసామగ్రి కావడంతో పాటు పర్యావరణ హితమైనవి. ఎటువంటి విద్యార్హత లేకున్నా వెదురుపనితెలిసి, 18 నుంచి 45 సంవత్సరాలలోపు ఉన్నవారు ఇక్కడికి శిక్షణకు వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.


విడతల వారీగా.. 

జీఎంఆర్‌ఐటీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఉపాధి అవకాశాల్లో భాగంగా చేతివృత్తుల వారికి సాంకేతికతను అందిస్తున్నాం. ఓ వైపు చేతివృత్తుల వారికి మెలకువలు  నేర్పడంతో పాటు మరో వైపు ప్లాస్టిక్‌ వస్తుసామగ్రి వినియోగం తగ్గించడం లక్ష్యంగా ఈకార్యక్రమం జరుగుతోంది. ఒక బ్యాచ్‌కి 20 మంది వరకూ శిక్షణ ఇస్తున్నాం. విడతల వారీగా, వెదురుపనివారికి ఖాళీగా ఉన్న సమయంలో ఈ శిక్షణ ఇస్తున్నాం.  
– డాక్టర్‌ పీఎన్‌ఎల్‌ పావని, కో ప్రిన్సిపాల్‌ ఇన్విస్టిగేటర్, జీఎంఆర్‌ఐటీ 


చాలా మంచి ప్రాజెక్ట్‌ 

చేతివృత్తి చేసుకునేవారిలో నైపుణ్యం మెరుగుపరిచేందుకు, వారికి సాంకేతికత అందించేందుకు సీడ్‌ సాయంతో వెదురుపనిచేసే చేతివృత్తుల వారికి శిక్షణ శిబిరం ఏర్పాటుచేశాం. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లోని వెదురుపనివారికి అవకాశం కల్పిస్తున్నాం. ఇప్పటివరకూ 150 మంది   శిక్షణ పొందారు.   
– డాక్టర్‌ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్, ప్రాజెక్ట్‌ ప్రిన్సిపాల్‌ ఇన్విస్టిగేటర్, జీఎంఆర్‌ఐటీ, రాజాం

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు