సీనరేజి వసూళ్లకు రాజస్థాన్‌ మోడల్‌

15 Jun, 2021 04:29 IST|Sakshi

గనుల శాఖలో త్వరలో కొత్త విధానం

అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా సీనరేజి వసూళ్లు

ఈ–వేలం ద్వారా చిన్నతరహా గనుల లీజులు

విలువ ఆధారంగా కాకుండా బరువును బట్టి సీనరేజి నిర్థారణ

ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంతో ప్రభుత్వ ఆదాయానికి గండి

కొత్త విధానంలో 25 నుంచి 40 శాతం ఆదాయం పెరిగే అవకాశం 

సాక్షి, అమరావతి: గనులు, భూగర్భ శాఖలో సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బూజు పట్టిన పాత విధానాలకు స్వస్తి పలికి కొత్త విధానాలను అమల్లోకి తీసుకు రాబోతోంది. దీనిపై ఇప్పటికే పూర్తిస్థాయి అధ్యయనం, కసరత్తు చేసింది. లాంఛనాలన్నీ పూర్తిచేసి కొత్త విధానాన్ని త్వరలో ఆచరణలో పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. మూడు అంశాలకు సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న విధానాలను పూర్తిగా మార్చివేయాలని నిర్ణయించింది.

మారనున్న సీనరేజి వసూళ్ల తీరు
చిన్నతరహా గనుల సీనరేజి వసూళ్ల విధానం మారనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,388 గనుల లీజులు ఉండగా.. వాటినుంచి సీనరేజిని గనుల శాఖ అధికారులే వసూలు చేస్తున్నారు. భారీ సంఖ్యలో ఉన్న గనుల నుంచి సీనరేజి వసూళ్లు, జరిమానాలు వంటి పనులన్నీ పరిమిత సంఖ్యలో ఉన్న ఉద్యోగులు, అధికారులు నిర్వహించడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో అనధికారిక మైనింగ్, అక్రమ రవాణా వల్ల ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గిపోతోంది. దీనిని అధిగమించే క్రమంలో సీనరేజి వసూళ్లను మిగిలిన రాష్ట్రాల్లో ఎలా చేస్తున్నారనే దానిపై గనుల శాఖ అధికారులు అధ్యయనం చేశారు. రాజస్థాన్‌లో అనుసరిస్తున్న అవుట్‌సోర్సింగ్‌ విధానం శాస్త్రీయంగా ఉందని నిర్థారించి.. అదే విధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించారు. దీని ప్రకారం  జిల్లాల వారీ సీనరేజి వసూళ్ల బాధ్యతను అవుట్‌ సోర్సింగ్‌కు అప్పగించనున్నారు. ఇసుక తప్ప అన్ని చిన్నతరహా గనులకు ఈ విధానాన్ని వర్తింపచేయాలని నిర్ణయించారు. దీనివల్ల 25 నుంచి 40 శాతం ఎక్కువ ఆదాయం ఖజానాకు వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రైవేటు ఏజెన్సీలు సీనరేజి వసూలు చేయడం వల్ల అక్రమ రవాణా, అనధికారిక మైనింగ్‌ కూడా తగ్గినట్టు రాజస్థాన్‌ మోడల్‌లో స్పష్టమైందని.. ఇక్కడా అదే జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

బరువును బట్టి సీనరేజీ నిర్థారణ
కీలకమైన రెండో అంశం సీనరేజి ఎంత కట్టాలో నిర్థారించేది. ప్రస్తుతం మెటీరియల్‌ విలువ ఆధారంగా (వాల్యూ మెట్రిక్‌) సీనరేజిని నిర్థారిస్తున్నారు. రకరకాల సైజుల్లో ఉండే గ్రానైట్‌ ఇతర ఖనిజాల వాస్తవ విలువ ఎంతో అంచనా వేసి లెక్కించడం ఇబ్బందికరంగా మారింది. దీనికి బదులు బరువును కొలవడం ద్వారా శాస్త్రీయంగా సీనరేజిని నిర్థారించాలని నిర్ణయించారు. గనుల సమీపంలో వే బ్రిడ్జిలు ఏర్పాటు చేసి ఖనిజం బరువు కొలుస్తారు. దీనివల్ల 10 నుంచి 15 శాతం ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రతి వాహనాన్ని గనుల శాఖతో అనుసంధానం చేసి వే బ్రిడ్జి దగ్గర అందులో ఉన్న బరువును కొలవడం ద్వారా కచ్చితమైన విలువ తెలుస్తుంది. అక్కడ ఏర్పాటు చేసే సీసీ కెమెరాలు, తనిఖీల వల్ల అక్రమ రవాణా కూడా తగ్గి మరో 15 నుంచి 20 శాతం ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒడిశా, రాజస్థాన్, గుజరాత్‌లో అమల్లో ఉన్న ఈ విధానాన్ని ప్రకాశం జిల్లాలో గ్రానైట్‌ మైనింగ్‌పై ప్రయోగాత్మకంగా అమలు చేశారు. దీనివల్ల 25 శాతం ఆదాయం పెరిగినట్టు తేల్చారు.

ఈ–వేలం ద్వారా చిన్నతరహా గనుల లీజులు
మూడో అంశంగా.. చిన్నతరహా గనుల లీజులు కేటాయించేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న మొదట వచ్చిన వారికే మొదటి ప్రాధాన్యం (ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌) స్థానంలో ఈ–వేలాన్ని ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత విధానం వల్ల సమర్థులైన, అర్హులైన పారిశ్రామికవేత్తలు క్వారీ లీజులు పొందలేకపోతున్నారు. దీనికి బదులు ఈ–వేలం ప్రవేశపెట్టి లీజులను ఆలస్యంగా లేకుండా జారీ చేయడం, అర్హులకు లీజుకివ్వడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాత విధానంలో 1,156 లీజుల్లో ఉన్న వ్యక్తులు మైనింగ్‌ జరపకపోవడం వల్ల ప్రభుత్వానికి రూ.136 కోట్ల నష్టం వస్తోంది. కొత్త విధానంలో ఈ సమస్యలను పరిష్కరించి ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తున్నారు. చాలాకాలంగా మైనింగ్‌ చేయకుండా ఉన్న గనుల లీజులను కూడా రద్దు చేసి, వాటికి కూడా ఈ–ఆక్షన్‌ నిర్వహించనున్నారు. 

ఆదాయం పెంపే లక్ష్యంగా కొత్త విధానం
గండి పడుతున్న ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కొత్త విధానాన్ని రూపొందించాం. సీనరేజి వసూళ్లు, బరువు ఆధారిత కొలత, మైనింగ్‌ మినరల్స్‌ ఈ–వేలం ద్వారా ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నాం. దీని అమలుకు న్యాయ సలహా తీసుకుంటున్నాం. త్వరలో ఆచరణలోకి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– వీజీ వెంకటరెడ్డి, డైరెక్టర్, గనులు, భూగర్భ శాఖ  

మరిన్ని వార్తలు