అల్లూరి జిల్లా: 3 గంటలు చార్జ్‌తో 60 కి.మీ. రయ్‌.. అక్క కోసం తమ్ముడి ‘ఈ’ స్కూటర్‌

26 Aug, 2022 10:02 IST|Sakshi

అక్క కోసం ఓ తమ్ముడు తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఏకంగా బండిని బ్యాటరీతో నడిచేలా తయారు చేశాడు. ఇంకేంముంది.! అక్క తక్కువ ఖర్చుతో బ్యాటరీ స్కూటర్‌పై రయ్‌రయ్‌మంటూ దూసుకుపోతోంది. తమ్ముడు కృషిని అక్కతో పాటు ఇరుగుపొరుగు వారు ప్రశంసిస్తున్నారు.  

సాక్షి, అల్లూరి జిల్లా: జిల్లాలోని రాజవొమ్మంగికి చెందిన సామన సురేష్‌ స్థానికంగా ఎలక్ట్రీషియన్‌. ఫ్యాన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు రిపేర్‌ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో మోటారు ఏ విధంగా పని పని చేస్తుంది? బ్యాటరీ పనితనం తదితర అంశాలను బాగా ఆకళింపు చేసుకున్నాడు. కాగా.. రాజవొమ్మంగికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో సురేష్‌ అక్క వెంకటలక్ష్మి బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టారుగా పనిచేస్తున్నారు. ఆమె రోజూ స్కూటర్‌పై విధులకు వెళ్తుంటుంది.

ఈ క్రమంలో.. పెట్రోల్‌ ధరలు పెరగడం, ఒకటి రెండు సార్లు ఆమె తన భర్తను పెట్రోల్‌ కోసం డబ్బులు అడగటం సురేష్‌ చెవిన పడింది. పెట్రోల్‌తో నడిచే ఆ స్కూటర్‌ మైలేజ్‌ లీటరుకు 30 కిలోమీటర్లే వస్తోంది. కిలోమీటరుకు సుమారు రూ.4 ఖర్చవుతోంది. రోజూ 12 కిలోమీటర్ల దూరం వెళ్లి వచ్చేందుకు సుమారు రూ.96 అవసరం. ఇలా నెలకు రూ.2,880 ఖర్చవుతోంది. ఆమె చేసేది చిన్న ఉద్యోగం. అందులో సగం జీతం పెట్రోలు ఖర్చులకే పోతుండటంతో సురేష్‌ ఆలోచనలో పడ్డాడు. అప్పటికే.. 

సురేష్‌ బ్యాటరీతో నడిచే ఓ సైకిల్‌ తయారు చేసి ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించాడు. కానీ అక్కను సైకిల్‌పై పోస్టాఫీసుకు వెళ్లమనడం ఇష్టం లేక.. ఆమె ఉపయోగించే స్కూటర్‌కే బ్యాటరీలు అమర్చే పనిలో పడ్డాడు. మెదడుకు పదును పెట్టి దాదాపు రెండు వారాలు కష్టపడ్డాడు. అతని కృషి ఫలించింది. స్కూటర్‌ను ఇటు పెట్రోల్‌తో.. అలాగే బ్యాటరీతోనూ నడిచేలా తయారు చేశాడు. సురేష్‌ తెలివితేటలకు ఆమె మురిసిపోయారు. రయ్‌ రయ్‌మంటూ రోడ్లపై పరుగులు తీస్తున్న స్కూటర్‌తో మరింత అనుబంధం పెంచుకున్నారు. సెల్‌ఫోన్‌కు మాదిరిగానే బ్యాటరీ చార్జ్‌ చేస్తే సరిపోతుండటంతో వెంకటలక్ష్మి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇప్పుడిక బండిలో పెట్రోలు ఉందా లేదా చూడనవసరం లేకుండా ఝామ్మని ఆఫీసుకు దూసుకెళ్లిపోతున్నారు.  


3 గంటలు చార్జ్‌ చేస్తే 60 కి.మీ. వెళ్లొచ్చు 
పెట్రోల్‌తో నడిచే స్కూటర్‌ను బ్యాటరీతో కూడా నడిచేదిగా తయారు చేసేందుకు తనకు రూ. 28,000 ఖర్చయిందని సురేష్‌ తెలిపారు. మూడు 12 ఓల్ట్స్‌ బ్యాటరీలతో తయారు చేసిన ఈ స్కూటర్‌కు మూడు గంటల పాటు చార్జ్‌ చేస్తే 60 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. పైకి పెట్రోల్‌ స్కూటర్‌ మాదిరిగా ఉన్న బ్యాటరీ స్కూటర్‌ను స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. 

ఇదీ చదవండి: కవిత్వమే ఆయుధమై.. చైతన్య తూటాలను పేల్చి..

మరిన్ని వార్తలు