పారిశ్రామిక ప్రగతికి పూర్తి సహకారం

2 Dec, 2021 04:18 IST|Sakshi

పారిశ్రామికవేత్తలు, సంఘాలతో సమావేశంలో నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌

పీఎల్‌ఐ స్కీంను వినియోగించుకొని తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టండి

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది

నిబంధనల సరళీకృతంతో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించవచ్చు

సాక్షి, అమరావతి: రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ హామీ ఇచ్చారు. పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడం, పారిశ్రామిక కార్యకలాపాలను పెంచడం, ఎగుమతుల వృద్ధి లాంటి అంశాల్లో తోడ్పాటు అందిస్తామని తెలిపారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా నీతి ఆయోగ్‌ బృందం బుధవారం ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక సంఘాలతో ఇష్టాగోష్టి నిర్వహించింది. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆథారిత ప్రోత్సాహకాలు (పీఎల్‌ఐ) పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఈ అవకాశాన్ని వినియోగించుకొని పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా రాష్ట్ర పారిశ్రామికవేత్తలను రాజీవ్‌ కుమార్‌ కోరారు.

సులభతర వాణిజ్యం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌)లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, నిబంధనలను మరింత సరళీకృతం చేయడం ద్వారా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించవచ్చని చెప్పారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించిందన్నారు. సులభతర వ్యాపారానికి దాదాపు 1,300 నియమ, నిబంధనలు అడ్డుగా ఉన్నాయని, ఇందులో 397 నిబంధనలను పూర్తిగా లేదా సరళీకృతం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలియచేసిందని చెప్పారు. పారిశ్రామికవేత్తలు, సంఘాలు చేసిన సూచనలను తప్పకుండా పరిశీలిస్తామని తెలిపారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాటిని క్రోడీకరించి నీతి ఆయోగ్‌కు అందచేస్తారని, వాటిని ఆయా మంత్రిత్వ శాఖలకు పంపి పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని చెప్పారు.

ఎంఎస్‌ఎంఈలకు ముఖ్యమంత్రి ప్రాధాన్యం
వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా(ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలకు సీఎం వైఎస్‌ జగన్‌ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పరిశ్రమలు, వాణిజ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్‌ వలవన్‌ తెలిపారు. కోవిడ్‌ సమయంలో ఎంఎస్‌ఎంఈలకు గత ఐదేళ్ల బకాయిలను చెల్లించడంతోపాటు వైఎస్సార్‌ నవోదయం ద్వారా రుణాలను పునర్‌వ్యవస్థీకరించి ఆదుకున్నారని గుర్తు చేశారు. ఈ చర్యలతో కోవిడ్‌ సమయంలో కూడా దేశ సగటు కంటే జీఎస్‌డీపీ, ఎగుమతుల్లో రాష్ట్రం అధిక వృద్ధి రేటు నమోదు చేసిందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా వెనుకబడిన జిల్లాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా రాయితీలు ఇస్తున్నామన్నారు. విభజన హామీ ప్రకారం పెట్రోలియం కారిడార్‌ ఏర్పాటుకు తోడ్పాటు అందించాలని కోరారు.

ప్రభుత్వ సాయంతో నిలబడ్డాం
పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని, కేంద్రం మరిన్ని ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ఆదుకోవాలని పారిశ్రామికవేత్తలు, సంఘాలు నీతి ఆయోగ్‌ను కోరాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ పాత బకాయిలను చెల్లించడంతో నిలదొక్కుకున్నామని, ఇందుకు ముఖ్యమంత్రి జగన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు ఏపీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రెసిడెంట్‌ పైడా కృష్ణ ప్రసాద్‌ పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి నీతి ఆయోగ్‌  మిగిలిన వాటి కంటే ఎక్కువగా ఏపీని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్‌  స్పెషల్‌ సెక్రటరీ కె.రాజేశ్వరరావు, ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్, ఏపీఐఐసీ వీసీఎండీ జవ్వాది సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు