నేడు తిరుమలకు రాష్ట్రపతి

24 Nov, 2020 03:39 IST|Sakshi

తొలుత పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్న కోవింద్‌ దంపతులు

అనంతరం తిరుమలలో స్వామివారి దర్శనం

రేణిగుంటలో రాష్ట్రపతికి స్వాగతం పలకనున్న గవర్నర్, సీఎం జగన్‌

సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుమల/సాక్షి, అమరావతి: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు మంగళవారం ఉదయం తిరుపతికి రానున్నారు. రాష్ట్రపతి పర్యటన వివరాలను చిత్తూరు జిల్లా కలెక్టర్‌ భరత్‌గుప్త తెలిపారు. ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి 10.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ వారికి రాష్ట్ర గవర్నర్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వాగతం పలుకుతారు. తర్వాత రోడ్డుమార్గంలో తిరుచానూరు చేరుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకుంటారు. అనంతరం 12.15 గంటలకు తిరుమల చేరుకుంటారు. శ్రీవారి దర్శనానంతరం 4.50 గంటలకు రేణిగుంట చేరుకుని, అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు వెళతారు. రాష్ట్రపతి దంపతులతో కలసి పద్మావతి అమ్మవారు, శ్రీవారి దర్శనానికి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ వెళతారు. రేణిగుంటలో రాష్ట్రపతికి స్వాగతం పలికిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తిరిగి తాడేపల్లికి బయలుదేరుతారు. 

పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. తిరుమలలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. పద్మావతి విశ్రాంతి భవనం, రాంభగీచ వసతి భవనాలు, వరాహ స్వామి ఆలయం, శ్రీవారి ఆలయాల్లో ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రపతి పర్యటించే ప్రాంతాలలో ప్రతి చోటా తగిన సంఖ్యలో సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. విధులు కేటాయించిన సిబ్బందికి ముందస్తుగా కోవిడ్‌ పరీక్షలు చేయించినట్లు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు