Ramzan Special: తింటే.. వదలరంతే.. ఏటా రూ.కోటి వ్యాపారం

15 Apr, 2022 11:17 IST|Sakshi

రంజాన్‌ స్పెషల్‌ హలీమ్‌ జోరుగా విక్రయాలు

ఏలూరు, భీమవరం కేంద్రాలుగా సరఫరా

సాక్షి, భీమవరం (ప్రకాశంచౌక్‌): రంజాన్‌ మాసంలో దర్శనమిచ్చే ప్రత్యేక వంటకం హలీమ్‌. ఉపావాసాలుండే ముస్లింలతో పాటు హిందువులు కూడా దీనిని ఇష్టపడుతుంటారు. రోజంతా ఉపవాస దీక్షలో ఉన్నవారు హలీమ్‌ ద్వారా శరీరంలో కొంత మేరకు శక్తిని పొందగలుగుతారు. దీంతో ఏటా రంజాన్‌ మాసంలో ప్రత్యేకంగా సెంటర్లు ఏర్పాటుచేసి హలీమ్‌ విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. జిల్లాలో 15 ఏళ్ల నుంచి హలీమ్‌ విక్రయాలు జరుగుతున్నాయి.  

 

హైదరాబాద్‌ నుంచి తయారీదారులు 
పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ప్రధానంగా భీమవరం, ఏలూరు కేంద్రాలుగా హలీమ్‌ అవుట్‌లెట్లు వెలుస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి తయారీదారులను తీసుకువచ్చి ఇక్కడ హలీమ్‌ను తయారు చేయిస్తున్నారు. వారికి నెలకు రూ.లక్ష వరకు చెల్లిస్తున్నారు. హలీమ్‌ తయారీ శ్రమతో కూడుకున్న పని. సుమారు 6 గంటలపాటు సమయం పడుతుంది.  

పరిసర ప్రాంతాలకు సరఫరా 
చికెన్, మటన్‌ హలీమ్‌లను తయారుచేస్తారు. వీటిని చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడుతుండటంతో హలీమ్‌ సెంటర్లకు జనం క్యూకడుతున్నారు. దీంతో ఏటేటా జిల్లాలో హలీమ్‌ విక్రయాలు పెరుగుతున్నాయి. భీమవరం, ఏలూరు కేంద్రాలుగా హలీమ్‌ను తయారుచేసి పరిసర ప్రాంతాలకు సరఫరా చేసి అక్కడ ఏర్పాటుచేసిన అవుట్‌లెట్లలో విక్రయిస్తున్నారు. భీమవరం కేంద్రంగా నరసాపురం, తణుకు, పాలకొల్లు తదితర ప్రాంతాలకు హలీమ్‌ను సరఫరా చేస్తున్నారు.  

ఏటా రూ.కోటి: పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఏటా రూ.కోటికి పైగా హలీమ్‌ వ్యాపారం జరుగుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. నెల రోజులపాటు ఒక్కో హలీమ్‌ కేంద్రంలో ఐదుగురి నుంచి ఆరుగురు ఉపాధి పొందుతున్నారు.  

నాకు చాలా ఇష్టం 
నాకు హలీమ్‌ అంటే చాలా ఇష్టం. రంజాన్‌ మాసంలో ఎక్కువ సార్లు తింటాను. ఏటా హలీమ్‌ కోసం ఎదురుచూస్తుంటా. భీమవరంలో హలీమ్‌ చాలా బాగుంటుంది. చికెన్, మటన్‌ హలీమ్‌ రెండూ కూడా నాకు ఇష్టం.  
– ఎస్‌కే.షాజహన్, భీమవరం  

ఏటా ఏర్పాటు చేస్తున్నాం  
భీమవరం పెద్ద మసీద్‌ సెంటర్‌ వద్ద ఏటా హలీమ్‌ సెంటర్‌ ఏర్పాటుచేస్తాం. హలీమ్‌ తయారీలో చేయి తిరిగిన వారిని హైదరాబాద్‌ నుంచి తీసుకువస్తాం. భీమవరంలో హలీమ్‌ను చాలా ఇష్టంగా తింటున్నారు. వ్యాపారం బాగుంది.  
– ఎస్‌కే బాబు, హలీమ్‌ సెంటర్‌ నిర్వాహకులు, భీమవరం  

మరిన్ని వార్తలు