ఆర్‌జీఎఫ్‌.. ఇది మన కేజీఎఫ్‌

20 Aug, 2022 08:30 IST|Sakshi

త్వరలో రామగిరి బంగారు గనుల తవ్వకం

10 బ్లాక్‌లలో తవ్వకాలకు రంగం సిద్ధం

సెప్టెంబర్‌ 2 వరకూ టెండర్లకు గడువు

బిడ్‌లు వేసేందుకు పలు సంస్థల ఆసక్తి

అత్యాధునిక టెక్నాలజీ సాయంతో మైనింగ్‌

ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి

సాక్షి ప్రతినిధి, అనంతపురం : అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని రామగిరి బంగారు గనులకు(ఆర్‌జీఎఫ్‌) మంచి రోజులొస్తున్నాయి. రెండు దశాబ్దాల కిందట మూసేసిన ఈ గనులు మళ్లీ తెరుచుకోనున్నాయి. దీంతో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరకనుంది. గనుల తవ్వకానికి సంబంధించిన సంస్థలను ఎంపిక చేసేందుకు టెండర్లనూ ఆహ్వానించారు. టెండర్ల స్వీకరణ గడువు సెప్టెంబర్‌ 2తో ముగుస్తుంది. ఆ తర్వాత  కొద్ది రోజుల్లోనే గనుల తవ్వకం ప్రారంభం కానుంది. రామగిరితో పాటు బొక్కసంపల్లి(రొద్దం మండలం), జౌకుల (కదిరి మండలం) ప్రాంతాల్లో 10 గోల్డ్‌ఫీల్డ్‌ బ్లాకులున్నాయి.

వీటిలో మైనింగ్‌ జరిపేందుకు రాష్ట్ర భూగర్భ గనుల శాఖ అంతర్జాతీయ సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించింది. ఇందుకోసం పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఇక్కడ బంగారు నిల్వలు బాగా ఉన్నట్టు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గతంలోనే  తేల్చింది. రామగిరిలో 1984లో భారత్‌ గోల్డ్‌మైన్‌ అనే కంపెనీ తవ్వకాలు చేసి, ఆ తర్వాత 2001లో ఆపేసింది. ఏడాదికి 124 కిలోల బంగారం వెలికితీయాలని, అలా 17 ఏళ్లు చేయాలన్నది అప్పటి కంపెనీ నిర్ణయం. తర్వాత రకరకాల కారణాలతో మైనింగ్‌ ఆపేశారు. 

ఈ గనుల్లోనే తవ్వకాలు 
రామగిరి నార్త్‌ బ్లాక్, సౌత్‌ బ్లాక్, బొక్కసంపల్లి నార్త్‌ బ్లాక్, సౌత్‌ బ్లాక్, జౌకుల ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్‌ బ్లాక్‌లలో తవ్వకాలకు టెండర్లు పిలిచారు. ఈ పది బ్లాకుల్లో తవ్వకాల టెండరును దక్కించుకునేందుకు ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయి. తాజాగా ఎంపిక చేసే సంస్థలకు తొలి రెండేళ్లు కాంపొజిట్‌ లైసెన్స్‌ ఇస్తారు. అంటే రెండేళ్ల పాటు తవ్వకాలు మాత్రమే చేస్తాయి. ఆ తర్వాత కమర్షియల్‌ లైసెన్స్‌(వాణిజ్య సంబంధిత) అనుమతులిస్తారు. రామగిరి, బొక్కసంపల్లి, జౌకుల ప్రాంతాల్లో ఉన్న గోల్డ్‌మైన్స్‌లో టన్ను మైనింగ్‌(తవ్వకం) జరిపితే 4 నుంచి 5 గ్రాముల వరకూ బంగారం వెలికి తీయొచ్చనేది అంచనా. ఒక్కో చోట 8 నుంచి 10 గ్రాముల వరకూ వెలికి వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా బంగారం ధర బాగా ఉండటం, అత్యాధునిక మైనింగ్‌ మెషినరీ అందుబాటులో ఉండటం వల్ల గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు ఎక్కువ మంది బిడ్డర్లు వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.   

భారీగా ఉపాధి అవకాశాలు 
ఇరవై ఏళ్ల కిందట మూతపడ్డ బంగారు గనులు తిరిగి తెరుచుకోనుండటంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.  ప్రత్యక్షంగా 10 వేల మందికి, పరోక్షంగా మరో 10 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నట్టు అంచనా. రవాణా రంగం, హోటల్‌ పరిశ్రమలు వంటి అనుబంధ పరిశ్రమలకు కూడా ఊతం ఇచ్చినట్టవుతుంది.   

అంతర్జాతీయ స్థాయి సంస్థలు బిడ్డింగ్‌కు రావడానికి రెండు కారణాలున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధర ఎక్కువగా ఉంది కాబట్టి మైనింగ్‌ చేసే సంస్థలకు నష్టమొచ్చే అవకాశమే లేదు. రెండోది.. అండర్‌ గ్రౌండ్‌ మైనింగ్‌. అండర్‌గ్రౌండ్‌ మైనింగ్‌ ప్రక్రియలో అత్యాధునిక యంత్రాలొచ్చాయి. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా మైనింగ్‌ జరుగుతుంది.  
– బాలసుబ్రమణ్యం, అసిస్టెంట్‌ డైరెక్టర్, గనుల శాఖ, అనంతపురం 

మరిన్ని వార్తలు