రూ.3 కోట్లతో రామతీర్థం ఆలయ పునఃనిర్మాణం

19 Jan, 2021 03:10 IST|Sakshi

పూర్తిగా రాళ్లతోనే నిర్మాణం

కొండపై విద్యుత్‌ దీపాలంకరణ, మెట్ల మార్గం వెడల్పు

దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఉన్నతాధికారులతో సమీక్ష

సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లా రామతీర్థం శ్రీరామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి, పునఃనిర్మాణానికి మూడుకోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. ఆయన సోమవారం దేవదాయశాఖ కార్యదర్శి గిరిజాశంకర్, ప్రత్యేక కమిషనర్‌ అర్జునరావు, ఆర్‌జేసీ భ్రమరాంబ, ఎస్‌ఈ శ్రీనివాస్‌తో సమావేశం నిర్వహించారు. 700 అడుగుల ఎత్తులో కొండపై ఉన్న స్వామి ఆలయాన్ని పూర్తిగా రాళ్లతోనే పునఃనిర్మించాలని నిర్ణయించారు. ఒకటి రెండు నెలల ముందు వరకు కనీసం విద్యుత్‌ సౌకర్యం లేని ఈ ఆలయ పరిసరాల్లో పునఃనిర్మాణ ప్రక్రియలో భాగంగా విద్యుత్‌ దీపాలంకరణ చేయాలని, కొండపైన శాశ్వత నీటివసతిని కల్పించాలని, ఆలయ ప్రాకారం నిర్మించాలని నిర్ణయించారు. కొత్తగా హోమశాల, నివేదనశాల నిర్మించటంతోపాటు ధ్వజస్తంభం ప్రతిష్టించాలని నిర్ణయించారు. కొండపైన ఆలయం వద్ద సహజ సిద్ధంగా ఉన్న కోనేటిని పూర్తిస్థాయిలో ఆధునికీకరించి దాని చుట్టూ గ్రిల్స్‌ ఏర్పాటు చేయాలని, ఆలయం వద్దకు వెళ్లేందుకు ఇప్పుడున్న ఇరుకు మెట్ల మార్గాన్ని బాగా వెడల్పు చేయాలని నిర్ణయించారు. 

ఫిబ్రవరి 13న అంతర్వేది ఆలయ రథప్రతిష్ట
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అంతర్వేది ఆలయ కొత్త రథం నిర్మాణం వేగంగా పూర్తయింది. ఫిబ్రవరి 13న కొత్తగా నిర్మించిన రథానికి అభిషేకం, పుర్ణాహుతి, రథప్రతిష్ట కార్యక్రమాలను దేవదాయశాఖ అధికారులు నిర్వహించనున్నారు. మూడురోజుల పాటు నూతన రథానికి వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం సంప్రోక్షణ చేస్తారు. 11న సంకల్పం, 12న అధివాస కార్యక్రమం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 22వ తేదీన అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కళ్యాణం జరుగుతుంది. 23న స్వామి ఊరేగింపును కొత్త రథంపై నిర్వహిస్తారు.  

మరిన్ని వార్తలు