Nellimarla: రామకోనేరుకు మహర్దశ

22 Jul, 2022 17:35 IST|Sakshi
రామతీర్థంలోని రామకోనేరు

కోనేరు అభివృద్ధికి ప్రణాళికలు

రూ.1.50 కోట్లతో ప్రతిపాదనలు

అంచనాలు సిద్ధం చేస్తున్న అధికారులు 

నెల్లిమర్ల రూరల్‌ (విజయనగరం జిల్లా): పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి ఆలయం పక్కనున్న రామకోనేరుకు మహర్దశ కలగనుంది. కోనేరు అభివృద్ధి పనులకు దేవదాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అమృత సరోవర్‌ కార్యక్రమంలో భాగంగా కోనేరును బాగుచేసేందుకు రూ.1.50 కోట్ల వ్యయంతో దేవదాయశాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు ఉపాధిహామీ సిబ్బంది రామకోనేరుకు జియో ట్యాగింగ్‌ పూర్తి చేశారు. జలవనరుల శాఖ అధికారులు కోనేరుకు కొలతలు వేసి అభివృద్ధి పనులపై అంచనాలు రూపొందించే పనిలో నిమఘ్నమయ్యారు. 

12 ఎకరాల్లో రామకోనేరు
రామకోనేరు 12 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. రామక్షేత్రానికి విచ్చేసే భక్తులు ముందుగా కోనేరులో పుణ్య స్నానమాచరించిన తరువాత సీతారామస్వామిని, ఉమా సదాశివుడిని దర్శించుకుంటారు. ప్రస్తుతం రామకోనేరులో రెండు పుష్కర ఘాట్‌లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన ఆలయాల కోనేరుల అభివృద్ధిలో భాగంగా ఆ శాఖ అధికారులు తాజాగా అమృత సరోవర్‌ పథకం కింద రామతీర్థం కోనేరును ఎంపిక చేశారు. పనులు పూర్తయితే రామక్షేత్రానికి మరింతి శోభ సాక్షాత్కరించనుంది.  


కోనేరు అభివృద్ధి ఇలా... 

రామకోనేరులోకి నీరు వచ్చి పోయేందుకు ఇన్‌లెట్, ఔట్‌లెట్‌ నిర్మాణాలు పూర్తి చేస్తారు. కోనేరు చుట్టూ ఉన్న గట్టును మరింత పటిష్టం చేయనున్నారు. కోనేరులో పూడికతీత పనులు, చుట్టూ రాతి కట్ట నిర్మాణాలు, పడమర వైపు సువిశాలంగా పుష్కర ఘాట్‌ నిర్మాణం, భక్తుల సౌకర్యార్థం పుష్కరఘాట్‌ల వద్ద అదనపు షెడ్‌ల నిర్మాణం, మూడు అడుగుల ఎత్తులో గట్టు, రిటైనింగ్‌ వాల్స్‌ ఏర్పాటు తదితర అభివృద్ధి పనులు పూర్తిచేస్తారు. వీటితో పాటూ 100 మీటర్ల పోడవు, 5 మీటర్ల వెడల్పుతో కూడిన సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కోనేరు అభివృద్ధి పనులకు సుమారు రూ.3 కోట్లు అవసరమవుతాయని దేవస్థాన ఈఓ ప్రసాదరావు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 

అభివృద్ధి పనులకు కొలతలు 
రామతీర్థం దేవస్థానాన్ని ఇరిగేషన్‌ జేఈ శ్రీనివాసరావు గురువారం సందర్శించారు. అభివృద్ధి పనులకు ఈఓ ప్రసాదరావుతో కలిసి కోనేరు చుట్టూ కొలతలు వేశారు. పుష్కరిణి గట్టుతో పాటు ఇన్‌లెట్, ఔట్‌లెట్‌ చానళ్లను పరిశీలించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి పనులకు సంబంధించి పూర్తి నివేదికను అందజేస్తామని ఆయన తెలిపారు. (క్లిక్: రాజాం టు అమెరికా.. కష్టాలను ఈది సూపర్‌ సీఈవోగా)

మరిన్ని వార్తలు