రాష్ట్రానికి మణిహారం రామాయపట్నం పోర్టు

4 Dec, 2022 18:59 IST|Sakshi

పోర్టుకు భూములిచ్చిన ప్రజలకు అండగా ఉంటాం

కలెక్టర్‌ చక్రధర్‌బాబు

111 కుటుంబాలకు రూ.22.49 కోట్ల నష్ట పరిహార చెక్కులు, గృహ పట్టాల పంపిణీ    

గుడ్లూరు(పీఎస్‌ఆర్‌ నెల్లూరు):  అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టు రాష్ట్రానికే మణి హారం అవుతుందని కలెక్టరు కేవీఎన్‌ చక్రధర్‌బాబు అన్నారు. మండలంలోని రామాయపట్నం పోర్టు భూ నిర్వాసితులకు పునరావాస సహాయ కార్యక్రమాల్లో భాగంగా తెట్టు–రామాయపట్నం గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో నిర్మిస్తున్న గృహాలకు శనివారం కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి, జేసీ కూర్మనాథ్, సబ్‌ కలెక్టర్‌ శోభికతో కలిసి కలెక్టర్‌ భూమి పూజలు చేశారు.

అనంతరం శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పోర్టు ఏర్పాటుకు భూములిచ్చిన కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉండి మెరుగైన పునరావాస వసతులు కల్పిస్తామన్నారు. రామాయపట్నం పోర్టు వ్యవసాయ, మైనింగ్‌ ఉత్పత్తుల ఎగుమతులకు అనుకూలంగా ఉండడమే కాక నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు విరివిగా లభిస్తాయన్నారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, ముడి సరుకులను ఈ పోర్టు ద్వారా ఎగుమతులు, దిగుమతులు చేయవచ్చన్నారు.

జిల్లాలో ఒక  వైపు కృష్ణపట్నం మరో వైపు రామాపట్నం పోర్టు ఏర్పాటుతో పారిశ్రామికంగా జిల్లా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందన్నారు. పోర్టు కోసం భూములు ఇచ్చిన మొండివారిపాళెం, ఆవుల వారిపాళెం, కర్లపాళెం గ్రామాల ప్రజల సహకారం మరువలేనిదన్నారు. ఈ మూడు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ ఆర్‌అండ్‌అర్‌ ప్యాకేజీ, నష్ట పరిహారం అందిస్తున్నామన్నారు. ముందుగా మొండివారిపాళెం వారికి 111 గృహాలు మంజూరయ్యాయని, అందురూ ఇళ్లు నిర్మించుకుని త్వరగా గృహ ప్రవేశాలు చేయాలన్నారు. 

2023 డిసెంబర్‌ నాటికి మొదటి దశ పూర్తి 
850 ఎకరాల్లో చేపట్టిన పోర్టు నిర్మాణ పనులు మొదటి దశ 2023 డిసెంబరు నాటికి పూర్తి చేయాలనే  లక్ష్యంతో పని చేస్తున్నామని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి చెప్పారు. పోర్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన ప్రజలు గొప్పదార్శకులని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం మాదిరిగా శంకుస్థాపనతో సరి పెట్టకుండా ముందుగానే అన్ని రకాల అనుమతులు, నిధులు సమకూర్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జూలై 20న భూమి చేశారని అప్పటి నుంచి అరబిందో కంపెనీ, మారిటైం బోర్డులు ఆధ్వర్వంలో పనులు నిర్విరామంగా జరుగుతున్నాయన్నారు.

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ప్రలోభాలకు గురి చేసినా నీతి నిజాయితీ ఉన్న మత్స్యకారులు వాటిని తిరస్కరించి ప్రభుత్వంపై నమ్మకంతో పోర్టుకు ఈ ప్రాంత సమగ్రాభావృద్ధికి తమ భూములను అందించారన్నారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో జాయింట్‌ కలెక్టరు, సబ్‌ కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకుని నాలుగు నెలల వ్యవధిలోనే ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి భూసేకరణ ప్రకియ వేగంగా చేపట్టాన్నారు. శంకుస్థాపన, ప్యాకేజీలు ఇచ్చి ఈ ప్రాంత ప్రజలకు నచ్చినట్లు గృహాలు నిర్మించుకునేలా సంపూర్ణ స్వేచ్ఛను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.

జేసీ కూర్మనాథ్‌ మాట్లాడుతూ అత్యంత వేగంగా రామాయపట్నం పోర్టు పునరావాస ప్రక్రియను చేపట్టామని గతంలో ఎక్కడా కూడా ఇంత వేగంగా చేపట్టిన దాఖలాలు లేవన్నారు. అనంతరం మొండివారిపాళెంకు చెందిన 111 కుటుంబాలకు రూ.22.49 కోట్లు నష్ట పరిహార చెక్కులు, ఇంటి నివేశ స్థలాల చెక్కులు కలెక్టర్, ఎమ్మెల్యేలు పంపిణీ చేశారు. కాలనీలో రామాలయ నిర్మాణానికి కాపులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో రామాయపట్నం పోర్టు ఎంపీ ప్రతాప్‌రెడ్డి, లైజనింగ్‌ ఆఫీసర్‌ ఐ.వెంకటేశ్వరరెడ్డి, అరబిందో సంస్థ ప్రతినిధి భీముడు, జనరల్‌ మేనేజరు ఎంఎల్‌ నరసింహారావు, ఎంపీపీ పులి రమేష్, జెడ్పీటీసీ కొర్శిపాటి బాపిరెడ్డి, తహసీల్దార్లు లావణ్య, సీతారామయ్య, సర్పంచ్‌లు గంగమ్మ, రమణయ్య, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, గ్రామ కాపు పోలయ్య, అధికారులు, నిర్వాసిత గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు