అక్రమాల ఆసుపత్రి

22 Aug, 2020 04:58 IST|Sakshi
బందరు రోడ్డులో రమేష్‌ ఆస్పత్రి ముందు రోడ్డును ఆక్రమించి నిర్మించిన ర్యాంప్‌

గత సర్కారు అండదండలతో ‘రమేష్‌’ నిర్వాకాలు

రోడ్డు ఆక్రమించి హాస్పిటల్‌ ర్యాంపు నిర్మాణం

ప్రధాన ఆస్పత్రిలో అనధికారిక కట్టడం

వాణిజ్య అవసరాలకు పార్కింగ్‌ స్థలం వాడకం

సందర్శకుల వాహనాలు, అంబులెన్సులు రోడ్డుపైనే

బయోవేస్ట్‌ గుట్టుగా మున్సిపల్‌ డంపింగ్‌ యార్డుకు తరలింపు

మినీ ఎస్టీపీ ఊసే లేదు... ఆస్పత్రి మురుగంతా యూజీడీలోకే

సాక్షి, అమరావతి బ్యూరో/పటమట: అత్యాధునిక వైద్యం పేరుతో రోగుల నుంచి అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్న రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడింది. రమేష్‌ హాస్పిటల్స్‌ అధినేత డాక్టర్‌ పోతినేని రమేష్‌బాబు గత సర్కారు అండదండలతో ధనార్జనే లక్ష్యంగా అడ్డదిడ్డంగా నిర్మాణాలు చేపట్టారు.  
క్యాంటీన్‌ ‘సెట్‌’ చేశారు.. 
► విజయవాడలోని లయోలా కళాశాల ప్రాంగణంలో 1988లో ఆరు పడకలతో ప్రారంభమైన రమేష్‌ ఆస్పత్రి పార్కింగ్‌ స్థలంలో నిర్మాణాలు చేపట్టటంతోపాటు సెట్‌బ్యాక్‌ స్థలంలో క్యాంటీన్‌ ఏర్పాటు చేసింది. బందరు రోడ్డు బ్రాంచ్‌ ఆస్పత్రిలో ఏకంగా రోడ్డుపైనే ర్యాంపుల నిర్మాణం చేపట్టారు. సెట్‌బ్యాక్‌ నిబంధనలు పాటించలేదు. 
► ఆస్పత్రి, నర్సింగ్‌హోం, క్లినిక్స్‌ లాంటి వాటికి బిల్టప్‌ ఏరియాలో 20 శాతం స్టాఫ్‌ పార్కింగ్‌కు, 10 శాతం సందర్శకుల పార్కింగ్‌కు కేటాయించాలి. రమేష్‌ ఆస్పత్రి నిర్వాహకులు పార్కింగ్‌ కోసం రోడ్లను వినియోగిస్తున్నారు.  
► 10–15 మీటర్ల ఎత్తున్న ఆస్పత్రులకు 2.5 మీటర్లు సెట్‌బ్యాక్‌ వదలాల్సి ఉండగా రమేష్‌ ఆస్పత్రిలో 1.5 మీటర్లు మాత్రమే ఉంది. ఫలితంగా అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు తిరిగేందుకు అవకాశం లేదు.  

చివరకు మరుగుదొడ్లలోనూ.. 
► పార్కింగ్‌కు కేటాయించిన స్థలాన్ని స్టోర్‌ రూంగా వినియోగిస్తున్నారు. 
► ప్రధాన ఆసుపత్రి ఎదురుగా ఉన్న పోస్టాఫీస్‌ వద్ద డ్రైనేజీని మూసివేసి పార్కింగ్‌కు వాడుతున్నారు. ఇక్కడ అనధికారికంగా నిర్మించిన అంతస్తుకు ఎలాంటి అనుమతులు  లేవు. 
► మినీ సీవరేజి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఎస్టీపీ) ఏర్పాటు చేయకుండా ఆస్పత్రి  వ్యర్థాలను నేరుగా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి(యూజీడీ)కి కలిపేస్తున్నారు. 
► బ్రాంచ్‌ ఆస్పత్రిలో ఒక్క కనెక్షన్‌కే పన్ను చెల్లిస్తుండగా అందులో సుమారు 20 టాయిలెట్లు ఉన్నాయి. ప్రధాన ఆస్పత్రిలోనూ ఒక్క కనెక్షనే తీసుకుని 30 పైగా టాయిలెట్లకు  పన్ను చెల్లించడం లేదు. చివరకు మరుగుదొడ్ల పన్నును కూడా ఆసుపత్రి యాజమాన్యం ఎగ్గొట్టింది. 

గుట్టుగా బయోవేస్ట్‌ డంపింగ్‌.. 
► రమేష్‌ హాస్పిటల్స్‌లో రోజుకు సగటున రెండు టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఆస్పత్రులు విడుదల చేసే బయోవేస్ట్‌ను పర్యావరణశాఖ అనుమతులున్న 
ఏజెన్సీ ద్వారా డిస్పోజ్‌ చేయాలి. లేదా ఆస్పత్రి ఆవరణలోనే భూమిలో కలిసేలా ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలి. రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం అలాంటి ఏర్పాట్లేమీ చేయకపోగా   గుట్టుగా వీఎంసీ డంపింగ్‌ యార్డుకు తరలిస్తోంది.

ఉల్లంఘనలపై కఠిన చర్యలు
‘ఆస్పత్రికి అనుమతులపై పరిశీలన జరుగుతోంది. బందరు రోడ్డు విస్తరణలో నిర్వాసితులకు ఇచ్చిన రాయితీలను పరిశీలిస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవు. అక్రమాలు నిర్థారణ అయితే కూల్చివేస్తాం’ 
– సూరజ్, ఇన్‌చార్జి సిటీ ప్లానర్‌ 

రమేష్‌ ఆస్పత్రి ఘటన నిందితులకు రిమాండ్‌ పొడిగింపు
విజయవాడ లీగల్‌: విజయవాడ రమేష్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలోని ప్రైవేట్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో అరెస్టు అయిన ముగ్గురు నిందితులకు వచ్చే నెల ఒకటో తేదీ వరకు రిమాండ్‌ పొడిగిస్తూ మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ పి.శ్రీసత్యాదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేట్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న హోటల్‌ స్వర్ణ ప్యాలెస్‌ (రమేష్‌ హాస్పిటల్‌)లో మంటలు చెలరేగి 10 మంది చనిపోయి 20 మంది గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ కేసులో గవర్నర్‌పేట పోలీసులు డాక్టర్‌ కొడాలి రాజగోపాలరావు, డాక్టర్‌ కూరపాటి సుదర్శన్, మేనేజర్‌ పల్లపోతు వెంకటేష్‌లను ఈనెల 9న అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి ఈనెల 21 వరకు రిమాండ్‌ విధించారు. రిమాండ్‌ ముగియడంతో మచిలీపట్నం సబ్‌జైలులో ఉన్న నిందితులకు న్యాయమూర్తి వీడియో లింకేజి ద్వారా వచ్చే నెల ఒకటో తేదీ వరకు రిమాండ్‌ పొడిగించారు.

ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వాయిదా
స్వర్ణ ప్యాలెస్‌ ఘటనలో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయమని కోరుతూ రమేష్‌ హాస్పిటల్స్‌ అధినేత దాక్టర్‌ పి.రమేష్‌బాబు ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ విచారించిన న్యాయమూర్తి వి.శ్రీనివాస ఆంజనేయమూర్తి.. ఏపీపీ కౌంటర్‌ వేసేందుకు సమయం కోరడంతో కౌంటర్, వాదనల నిమిత్తం సోమవారానికి పిటిషన్‌ను వాయిదా వేశారు. 

మరిన్ని వార్తలు