Tech‌ Mantra Now Company: తండ్రి ఆశయం.. తనయుడి కార్యరూపం.. సొంతూరిలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ

26 Mar, 2022 08:34 IST|Sakshi
సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఏర్పాటు వివరాలను వెల్లడిస్తున్న వ్యవస్థాపకుడు రమేష్‌. చిత్రంలో ఆయన తండ్రి శ్రీరామ్మూర్తి తదితరులు 

సాక్షి, అమలాపురం టౌన్‌(తూ.గో): ఆయనో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు. ఉపాధ్యాయుడిగా 1999లో రాష్ట్రపతి అవార్డు పొందారు. ఉద్యోగ జీవితంలో వేలాది మందికి విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులను చేసిన ఆదర్శ ఉపాధ్యాయుడు. పేరు ఓరుగంటి శ్రీరామ్మూర్తి. ఊరు ముమ్మిడివరం మండలం అనాతవరం. ఆయన కుమారుడి పేరు రమేష్‌. ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన ఆయన.. కాలిఫోర్నియాలో ‘టెక్‌ మంత్రా నౌ’ పేరిట ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెట్టి దానికి ఫౌండర్, సీఈఓగా పని చేస్తున్నారు. అంతా బాగానే ఉన్నప్పటికీ పుట్టి, పెరిగిన ఊళ్లోనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెట్టి, గ్రామీణ యువతకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించాలన్నది శ్రీరామ్మూర్తి ఆశయం.

ఈ విషయాన్ని అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నడుపుతున్న తనయుడు రమేష్‌ దృష్టిలో పెట్టారు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చే లక్ష్యంతో టెక్‌ మంత్రా నౌ కంపెనీ శాఖను రమేష్‌ అనాతవరంలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ కంపెనీ శాఖలు హైదరాబాద్, బెంగళూరు, పుణె, చెన్నైలో ఉన్నాయి. ఈ క్రమంలోనే సొంతూరు అనాతవరంలో.. అదీ పూర్తి గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ కంపెనీ కొత్త శాఖ శనివారం ప్రారంభమవుతోంది. ఈ వివరాలను శ్రీరామ్మూర్తి, అమెరికా నుంచి వచ్చిన ఆయన తనయుడు రమేష్‌లు అమలాపురంలోని కన్యకా పరమేశ్వరి కల్యాణ మంటపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.

ప్రాథమికంగా 100 మందికి ఉద్యోగాలు 
అనాతవరంలో జాతీయ రహదారి 216 చెంతన నెలకొల్పిన ఈ కంపెనీలో ప్రాథమికంగా 100 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే 25 మందిని నియమించామని రమేష్‌ తెలిపారు. కాలిఫోర్నియాలో 2014లో స్థాపించిన తమ కంపెనీ ఏడో శాఖను అనాతవరంలో నెలకొల్పుతున్నామన్నారు. తాను అనాతవరం హైస్కూలులోనే పదో తరగతి వరకూ చదువుకున్నానని తెలిపారు.

తమ కంపెనీలో ట్రైనింగ్‌ హెచ్‌ఆర్‌గా పని చేస్తున్న పేరి విశాలి, డెలివరీ స్ట్రాటజీ డైరెక్టర్‌గా పని చేస్తున్న నూకల చిన వెంకటరత్నంలు కూడా కోనసీమకు చెందిన వారేనని చెప్పారు. వారు అమలాపురం ఎస్‌కేబీఆర్‌ కళాశాల పూర్వ విద్యార్థులని తెలిపారు. తండ్రి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ, తన ఆశయానికి అనుగుణంగా పుట్టిన ఊళ్లోనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెడుతున్న కుమారుడు రమేష్‌ ప్రయత్నాన్ని అభినందించారు.

మరిన్ని వార్తలు