త్రివిధ దళాధిపతీ అందుకో వందనం

20 Feb, 2022 03:58 IST|Sakshi
ఫ్లీట్‌ రివ్యూ కోసం విశాఖపట్నం తీరంలో మోహరించిన యుద్ధ నౌకలు, పడవలు

రేపు అంగరంగ వైభవంగా ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ 

నౌకాదళ సామర్థ్యాన్ని సమీక్షించనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 

పాల్గొననున్న 60 యుద్ధ నౌకలు, జలాంతర్గాములు 

55 యుద్ధ విమానాల విన్యాసాలతో రాష్ట్రపతికి వందన సమర్పణ 

నేడు విశాఖకు రాష్ట్రపతి, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సీఎం జగన్‌ 

ఏపీ గవర్నర్, అండమాన్‌ నికోబార్‌ దీవుల లెఫ్టినెంట్‌ గవర్నర్లు కూడా.. 

22 వరకు ప్రజలు వీక్షించే అవకాశం 

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారత త్రివిధ దళాధిపతికి నావికా దళం వందనానికి సర్వ సన్నద్ధమైంది. సముద్రంలో బారులు తీరిన యుద్ధ నౌకలు, ఆకాశంలో యుద్ధ విమానాల విన్యాసాలతో విశాఖ సాగర తీరం సందడి చేస్తోంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ థీమ్‌తో భారత నావికాదళ సేవలు, పరాక్రమం ఉట్టిపడేలా సోమవారం (21న) 12వ ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ (పీఎఫ్‌ఆర్‌) అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. త్రివిధ దళాల అధిపతి హోదాలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నౌకా దళ సామరధ్యన్ని సమీక్షిస్తారు. ఇందుకోసం రాష్ట్రపతి ఆదివారం సాయంత్రం 5.20 కు ప్రత్యేక విమానంలో ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకొంటారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తూర్పు నావికా దళం అధిపతి వైస్‌ అడ్మిరల్‌ బిస్వజిత్‌ దాస్‌ గుప్తా ఆయనకు సాదర స్వాగతం పలకనున్నారు. రాష్ట్రపతి ఆదివారం రాత్రి తూర్పు నావికా దళం (ఈఎన్‌సీ) ప్రధాన కార్యాలయంలో బస చేస్తారు. సోమవారం ఉదయం 9 గంటలకు ఫ్లీట్‌ రివ్యూ మొదలవుతుంది. 21 గన్‌లతో రాష్ట్రపతికి సెల్యూట్‌ చేయడంతో కార్యక్రమం ప్రారంభమై, 11.45 గంటల వరకూ జరుగుతుంది. ఈ రివ్యూలో నావికాదళంతో పాటు కోస్ట్‌గార్డ్, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ), మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్‌ సైన్స్‌ వంటి ఇతర సముద్ర సంస్థలకు చెందిన సుమారు 60 నౌకలు, నౌకా దళం జలాంతర్గాములు, 50కి పైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు పాల్గొంటాయి. 10 వేల మంది నావికాదళ అధికారులు, సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 1.15 గంటలకు పీఎఫ్‌ఆర్‌ గ్రూపు ఫోటో దిగడంతో పాటు తపాలా బిళ్లను, పోస్టల్‌ కవర్‌ను రాష్ట్రపతి ఆవిష్కరిస్తారు. 22వ తేదీ ఉదయం 10.20 గంటలకు విశాఖ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.

వేడుకలు ఇలా..
త్రివిధ దళాలకు అధిపతి హోదాలో భారత రాష్ట్రపతి తన పదవీకాలంలో యుద్ధ నౌకలను సమీక్షించే కార్యక్రమమే ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ. విశాఖ తీరంలో 44 యుద్ధ నౌకలను ఒక్కో వరుసలో 11 చొప్పున నాలుగు వరుసల్లో నిలిపి ఉంచారు. వీటిని విశాఖ బీచ్‌ నుంచి 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ ప్రజలు కూడా వీక్షించవచ్చు. రాత్రి సమయంలో యుద్ధ నౌకలు విద్యుద్దీపాలంకరణతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రపతి నౌకాదళ సమీక్ష కోసం ఐఎన్‌ఎస్‌ సుమిత్ర నౌకను ప్రత్యేకంగా తీర్చి దిద్దారు. ప్రెసిడెంట్‌ యాచ్‌గా పిలిచే ఈ నౌక  డెక్‌పై రాష్ట్రపతి ఆశీనులవుతారు. ఆయన పక్కన అశోక చక్ర ఎంబ్లమ్‌ కూడా ఉంటుంది. ఇదే యాచ్‌లో వేడుకల్లో పాల్గొనే కేంద్ర మంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు కూడా ఆశీసులయ్యేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

రాష్ట్రపతి అధిరోహించిన ఐఎన్‌ఎస్‌ సుమిత్ర తమ చెంతకు రాగానే ఒక్కో యుద్ధనౌకలో ఉన్న నౌకా దళాల అధికారులు, సిబ్బంది టోపీలను చేతిలో ఉంచుకుని తిప్పుతూ గౌరవ వందనం సమర్పిస్తారు. చివరగా నౌకా దళ యుద్ధ విమానాలు ఏకకాలంలో పైకి ఎగురుతూ.. రాష్ట్రపతికి సెల్యూట్‌ చేస్తాయి. అనంతరం సెయిలర్స్‌ పరేడ్‌ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా వాటర్‌ ఫ్రంట్‌ యాక్టివిటీస్, సముద్రంలో యుద్ధ విన్యాసాలు, సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఆపరేషన్స్, హాక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ద్వారా ఏరోబాటిక్స్, మార్కోస్‌ నిర్వహించే వాటర్‌ పారాజంప్‌ వంటి విన్యాసాల్ని రాష్ట్రపతి తిలకిస్తారు. అనంతరం గ్రూప్‌ ఫొటో దిగుతారు. తపాలా బిళ్ల, పోస్టల్‌ కవర్‌ ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, కేంద్ర కమ్యూనికేషన్‌ శాఖ సహాయ మంత్రి దేవ్‌సిన్హ్‌ జె చౌహాన్, రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, అండమాన్‌ నికోబార్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అడ్మిరల్‌ డి.కె.జోషి కూడా పాల్గొంటారు.

విశాఖ కేంద్రంగా మూడోసారి
గతంలో విశాఖ కేంద్రంగా ఒక ఫ్లీట్‌ రివ్యూ, ఒక అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ జరిగాయి. 2006లో తొలిసారి పీఎఫ్‌ఆర్‌ జరిగింది. అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం భారత నౌకాదళ సామర్థ్యాన్ని సమీక్షించారు. అనంతరం 2016లో అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌) జరిగింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ హాజరయ్యారు. ఇప్పుడు జరుగుతున్నది రెండో పీఎఫ్‌ఆర్‌. భారత దేశంలో మొదటి ఫ్లీట్‌ రివ్యూ 1953 అక్టోబరు 19న ముంబైలో అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పటివరకు 11 పీఎఫ్‌ఆర్‌లు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్నది 12వ ఫ్లీట్‌ రివ్యూ. 

మరిన్ని వార్తలు