రామోజీ రూటే వేరు...నిజాలెక్కడ?

8 Mar, 2021 02:50 IST|Sakshi

విద్యార్థులకు పుస్తకాల పంపిణీపై అవాస్తవాలతో రోత రాతలు

సంక్షేమ పథకాలు, సంస్కరణలతో ఒకే ఏడాది భారీగా పెరిగిన విద్యార్థులు

2020–21లో ప్రభుత్వ స్కూళ్లలో అదనంగా 6,06,285 మంది చేరిక

అంతకు ముందటి ఏడాది కన్నా ఇది ఏకంగా 15.6 శాతం అధికం

ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను మార్చేసిన ‘మనబడి: నాడు–నేడు’

గోరు ముద్దతో చక్కటి భోజనం; ఇంగ్లిష్‌ మీడియమూఅందుబాటులో 

విద్యాకానుకతో యూనిఫారాలు, పుస్తకాలు, బ్యాగులు

సంస్కరణల వల్ల 5% పెరగవచ్చని ముందే అధికారుల అంచనా

ఆ మేరకు పుస్తకాలను ముద్రించి మే నాటికే డిపోలకు పంపిణీ

అంచనాలకు మించి విద్యార్థుల చేరిక

దీంతో మిగిలిన వారికీ పుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు; నిధుల విడుదల

త్వరలో అందించే అవకాశం... ఇంతలోనే ‘ఈనాడు’ రోత రాతలు

విద్యార్థుల్లో ప్రభుత్వం కల్పించిన విశ్వాసాన్ని కనీసం ప్రస్తావించని తీరు  

(సాక్షి, అమరావతి): ‘‘సార్‌! నిజాలెక్కడ?’’ అని సూటిగా రామోజీని ప్రశ్నిస్తే ఆయనెప్పటికీ సమాధానం చెప్పలేరేమో!!. ఎందుకంటే వాస్తవాలకు ముసుగేయటం... అర్థ సత్యాలకు, అసత్యాలకు మేకప్పేసి అందంగా చూపించటంలో ‘ఈనాడు’ను ఆరితేరేలా చేశారాయన. ఆదివారంనాడు పతాక శీర్షికలో ఏపీ ప్రభుత్వాన్ని తప్పుబడుతూ ‘సార్‌! పుస్తకాలెక్కడ?’ అంటూ అచ్చేసిన కథనం అలాంటిదే. విద్యార్థుల సంఖ్యకు తగినన్ని పుస్తకాలు లేవని రాసిన ఈనాడు... ప్రతి జిల్లాలో ఏకంగా 20–25 శాతం మందికి పుస్తకాలు అందుబాటులో లేవంటూ పచ్చి అబద్ధాన్ని ఎంచక్కా వండేసింది. విద్యార్థుల సంఖ్య పెరిగిందని చెబుతూనే... ఆ పెరిగిన కారణాలు మాత్రం తనకు తోచినవి రాస్తూ అర్థసత్యాల్ని పేర్చేసింది. జగనన్న గోరుముద్ద, విద్యా కానుక వంటి పథకాలను చిత్తశుద్ధితో అమలు చేయటం.. నాడు–నేడు పేరిట విప్లవాత్మకమైన సంస్కరణలు తెచ్చి స్కూళ్ల రూపురేఖల్ని సమూలంగా మార్చటం.. ఇంగ్లీషు మీడియం చదువుల్ని అందరికీ అందుబాటులోకి తేవటం వల్లే ప్రభుత్వ స్కూళ్లలో ఈ చేరికలు పెరిగాయన్న నిజాల్ని ఒప్పుకోవటానికి మాత్రం రామోజీకి మనసొప్పలేదు. వాటి గురించి అక్షరం రాస్తే ఒట్టు. కరోనాతో చిన్నచిన్న స్కూళ్లు మూతపడ్డాయని, వారంతా ప్రభుత్వ స్కూళ్లకు మళ్లారని, ఉపాధి కోల్పోయిన వారు తమ పిల్లల్ని ప్రయివేటు స్కూళ్లలో చదివించలేక ప్రభుత్వ స్కూళ్లలో చేర్చారని, సొంత ఊళ్లకు వచ్చినవారు కూడా ఇలాగే చేయటంతో విద్యార్థుల సంఖ్య పెరిగిందని మాత్రం రాశారు. ‘ఈనాడా’... మజాకా!!

బాబు హయాంను గుర్తు చేయరేం?
రామోజీ సహచరుడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ను ఏలిన ఐదేళ్లలో ప్రభుత్వ బడుల్లో చేరికలు ఏటా తగ్గుతూనే వచ్చాయి. 2014లో బాబు పగ్గాలు చేపట్టే నాటికి ప్రభుత్వ స్కూళ్లలో మొత్తం 41,83,441 మంది చదువుతుండగా... 2019లో ఆయన్ను జనం దింపేసే నాటికి ఆ సంఖ్య ఏకంగా (2018–2019) 37,20,988కి పడిపోయింది. అదే సమయంలో ప్రయివేటు స్కూళ్ల అడ్మిషన్లు భారీగా పెరిగాయని వేరే చెప్పనక్కర్లేదు. అప్పుడు కరోనా లేదు కనక అందరి ఆదాయాలూ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి వారంతా ప్రయివేటు స్కూళ్లకు వెళ్లిపోయారనేది రామోజీరావు ఉద్దేశం కావచ్చు. అంతేతప్ప ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసి... విద్యను నానాటికీ తీసికట్టుగా తయారు చేసి... పేదలకు అందుబాటులో లేని అంగడి సరకుగా మార్చేశారన్న నిజాన్ని మాత్రం ఆయన చచ్చినా ఒప్పుకోరు. ఎందుకంటే అది బాబు పాలన కాబట్టి. ఇక వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే విద్యారంగం భవితపై విశ్వాసాన్ని కలిగించటంతో 2019–20లో ఈ సంఖ్య 38,97,156కి చేరింది. పథకాల్ని చిత్తశుద్ధితో అమలు చేయటం, సంస్కరణల్ని వేగవంతం చేయటంతో 2020–21 నాటికి ఇది ఏకంగా 45,03,441కి చేరింది. అంటే ఒకే ఏడాదిలో 6,06,285 మంది పెరిగినట్టన్న మాట!!. అంటే 15.6 శాతం. సహజంగా ఏ అధికారీ ఈ స్థాయిలో ప్రభుత్వ స్కూళ్ల అడ్మిషన్లు పెరుగుతాయని ఊహించరు. అప్పటికీ 5 శాతం పెరిగవచ్చన్న అంచనాతో ఆ మేరకు పుస్తకాలు ముద్రించారు. కానీ నానాటికీ చేరికలు పెరగటంతో ఈ సంఖ్య ఇంకా పెరిగింది. అయినప్పటికీ మిగిలిన వారికి కూడా సత్వరం పుస్తకాలందేలా చర్యలు చేపట్టామని, మరో 15 రోజుల్లో వారికి సైతం అవి అందుతాయని వారు స్పష్టంచేస్తున్నారు. 

‘నాడు–నేడు’... ఇది ఇంకా తొలి ఏడాదే!!
‘నాడు–నేడు’ కింద ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాలన్నది ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం. మూడేళ్ల వ్యవధిలో మొత్తం 47వేల పైచిలుకు స్కూళ్ల అభివృద్ధి పనులు చేపట్టాలనేది ప్రణాళిక. అందులో భాగంగా తొలి ఏడాది 15వేల స్కూళ్ల అభివృద్ధి పనులు చేపడితేనే ఆయా స్కూళ్ల అడ్మిషన్లు ఈ స్థాయిలో పెరిగాయి. మరి మిగిలిన దశలు కూడా పూర్తయితే అదనపు చేరికలో రాష్ట్రంలో ప్రభుత్వ విద్య ముఖచిత్రం ఏ స్థాయిలో మారుతుందో బహుశా... రామోజీరావు ఊహలకు కూడా అందకపోవచ్చు. మనబడి: నాడు–నేడు మాత్రమే కాదు... జగనన్న గోరు ముద్ద, విద్యాకానుక వంటి కార్యక్రమాలను ప్రభుత్వం కోట్ల రూపాయలతో అమలు చేస్తోంది. ఇంగ్లీషు మీడియాన్ని ఆరంభించింది. వీటికి సంబంధించి ప్రతి చిన్న అంశాన్నీ సీఎం స్వయంగా సమీక్షిస్తున్నారు. స్కూళ్లలో మౌలిక సదుపాయల నుంచి విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనంలోని ఆహర పదార్థాల మెనూ వరకూ ఆయనే స్వయంగా నిర్ణయించి పథకాలను రూపుదిద్దించారు. ఈ కారణాలే విద్యార్థులను ప్రయివేటు వదిలి ప్రభుత్వ పాఠశాలలవైపు నడిపించాయన్న వాస్తవాన్ని రాయటానికి మాత్రం రామోజీ ముందుకు రారు. అదే విచిత్రమంటే!!.

ప్రభుత్వ పథకాల ప్రభావమే ఇది...
విద్య, వైద్యం, వ్యవసాయాన్ని ప్రాధాన్య రంగాలుగా ముఖ్యమంత్రి ఎంచుకోవటంతో విద్యా రంగానికి సంబంధించి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. ఆర్థిక స్తోమతులేక తన పిల్లలను చదివించుకొనే పరిస్థితి ఏ తల్లికీ ఉండరాదన్న ఉద్దేశంతో 1–12 తరగతుల వరకు పిల్లలను బడులు, కాలేజీలకు పంపే అర్హురాలైన ప్రతి తల్లికీ ఏటా రూ.15వేలు ఇచ్చేలా అమ్మ ఒడి పథకాన్ని అమలు చేయిస్తున్నారు. గత రెండేళ్లలో ఈ పథకం కింద 44.49 లక్షల మంది తల్లులకు రూ.13,023 కోట్లను అందించారు. 

రూపు మార్చిన ‘మనబడి: నాడు–నేడు’
ప్రభుత్వ స్కూళ్ల స్థలాలను సైతం కబ్జాలు చేసి చంద్రబాబు హయాంలో నిర్వీర్యం చేయగా జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటన్నిటిలో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని 47,785 ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ప్రభుత్వ హాస్టళ్లను ‘మనబడిష్త్‌: నాడు–నేడు’ పథకం కింద అన్ని వసతులతో తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో మొదటి దశలో 15715 స్కూళ్లలో ఫర్నిచర్, ఫ్యాన్లు, రన్నింగ్‌ వాటర్‌తో మరుగుదొడ్లు, మంచినీరు, గ్రీన్‌చాక్‌ బోర్డులు, ప్రహరీలు, మరమ్మతులు, పెయింటింగ్, ఇంగ్లీషు ల్యాబ్స్‌ ఏర్పాటు చేయిస్తున్నారు. మొదటి విడత ఇప్పటికే రూ.2,248 కోట్లు ఖర్చు చేశారు. పాఠశాలలు, కళాశాలల్లో మరుగుదొడ్లు పరిశుభ్రత కోసం ప్రత్యేకంగా నిర్వహణ ఫండ్‌ను కూడా ఏర్పాటుచేయించారు.

స్కూలు తెరవటానికి ముందే... జగనన్న విద్యాకానుక
ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు కార్పొరేట్‌ స్కూళ్ల విద్యార్థులకు దీటుగా ఉండేలా వారికి జగనన్న విద్యాకానుక కింద 3 జతల యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్కులు, షూ, సాక్సులు, బ్యాగును అందిస్తున్నారు. గత ఏడాదిలో ఈ పథకం కింద రూ.648 కోట్లతో 42,34,322 మందికి వీటిని అందించారు. స్కూళ్లు తెరవటానికి ముందే వీటన్నిటినీ సిద్ధం చేసి విద్యార్థులకు అందించాలని, తొలి రోజు నుంచే వారంతా వీటితో స్కూళ్లకు వెళ్లాలని చేసిన ఈ ప్రయత్నం అపూర్వమే కాదు. అద్భుతమంటూ విద్యావేత్తలు కొనియాడారు కూడా!!.

ఆరోగ్యంగా ఉండేలా... గోరుముద్ద
విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం అంతకు ముందు వరకు నాసిరకంగా ఉండగా సీఎం దాని నాణ్యతను పెంచడమే కాకుండా విద్యార్థులకు రోజుకోరకమైన మెనూతో రుచి, శుచికరమైన ఆహారాన్ని పెట్టేలా చేశారు. సీఎం స్వయంగా తానే ఈ మెనూను రూపొందించడం గమనార్హం. జగనన్న గోరుముద్ద పథకం కింద గుడ్లు, చిక్కీలు అందిస్తున్నారు. ఆహారం వండిపెట్టే పని వారికి, సహాయకులకు ఇచ్చే వేతనాన్ని రూ.1000 నుంచి రూ.3వేలకు పెంచారు కూడా. 

కాన్వెంట్‌కు దీటుగా వైఎస్సార్‌ ప్రీప్రైమరీ స్కూళ్లు
విద్యార్థుల మేధ వికసించే సమయంలోనే వారికి చక్కని విజ్ఞానాన్ని అందించే ప్రయత్నంతో ప్రీప్రైమరీ విద్యా విధానాన్ని ప్రభుత్వం ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తెచ్చింది. 3–6 ఏళ్ల పిల్లల్లో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచేలా ఆటపాటలతో విజ్ఞానాన్ని అందించేందుకు పీపీ1, పీపీ2 విధానాన్ని చేపట్టారు. వీరికోసం సంపూర్ణ పోషణ పథకాన్ని అమలు చేయిస్తున్నారు. మొత్తం 55607 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు.

పాఠ్యాంశాల్లో సంస్కరణలు...
పాఠశాల విద్యను పరిపుష్టం చేసి పునాది స్థాయి నుంచే నాణ్యతా ప్రమాణాలు పెంచేలా ప్రభుత్వం కరిక్యులమ్‌లో కూడా సంస్కరణలు చేపట్టింది. 1–6 తరగతుల వరకు ఉన్న కరిక్యులమ్‌ను మార్పు చేయడమే కాకుండా ఆంగ్ల మాధ్యమంలో అభ్యసించాలనుకొనే వారికి, తెలుగు మాధ్యమ విద్యార్థులకు వీలుగా ఉండేలా ఒకే పుస్తకంలో రెండు మాధ్యమ పాఠ్యాంశాలను ముద్రించి ఇచ్చారు. సెమిస్టర్‌ విధానాన్ని ఏర్పాటు చేయించారు. ఇది కాకుండా పాఠశాల విద్యను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రమాణాలు పెరిగేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకొనేందుకు దేశంలోనే తొలిసారిగా పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను ఏర్పాటుచేయించారు. ఈ విధానాన్ని ఆ తరువాత కేంద్రం జాతీయ విద్యావిధానంలో పొందుపరిచింది. వీటన్నిటితో పాటు కరోనా వల్ల దేశంలో స్కూళ్లను ఇతర రాష్ట్రాల్లో అరకొరగా తెరవగా రాష్ట్రంలో మాత్రం ఒక ప్రణాళిక ప్రకారం దశల వారీ తెరుస్తూ ఎక్కడా అవాంతరాలు లేకుండా 1 నుంచి 12 వరకు తరగతులు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇవన్నీ కలిసి విద్యార్థులను ప్రభుత్వ స్కూళ్లవైపు నడిపించగా... ఆ విషయాలన్నీ కావాలని విస్మరించేసి... కొద్దిమందికి ఇంకా పుస్తకాలు అందలేదంటూ ‘ఈనాడు’ వండిన కథనమే వారి విజ్ఞతెంతో చెబుతోంది!!.  

మరిన్ని వార్తలు