డీజీపీని కలిసిన రమ్య కుటుంబ సభ్యులు

23 Aug, 2021 22:42 IST|Sakshi

సాక్షి, మంగళగిరి: గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసును త్వరితగతిన ఛేదించిన ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకు రమ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను కలిసిన రమ్య కుటుంబ సభ్యులు.. ఘటనకు ముందు, అనంతరం జరిగిన పరిణామాలను వివరించారు. ఓ హత్య కేసులో పోలీసులు ఇంత వేగంగా స్పందించడం గతంలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. ఘటన అనంతరం తమ కుటుంబంపై కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ మానసికంగా వేదిస్తున్నారని ఫిర్యాదు చేశారు. 

డబ్బులకు అమ్ముడుపోయామంటు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారని, ఆ కారణంగా ఇంట్లో భోజనం కూడా చేయలేక పోతున్నామని వాపోయారు. అటువంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం డీజీపీ స్పందిస్తూ.. కేసు దర్యాప్తులో చురుకుగా వ్యవహరించిన గుంటూరు అర్బన్ ఎస్పీ, సిబ్బందిని అభినందించారు. రమ్య కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని.. వారికి రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. రమ్య కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు