సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం

1 May, 2022 04:10 IST|Sakshi
రమ్య కుటుంబసభ్యులతో మాట్లాడుతున్న మంత్రి మేరుగ నాగార్జున

రమ్య తల్లి జ్యోతి కృతజ్ఞతలు

బిడ్డను కోల్పోయిన కష్టసమయంలో మాలో ధైర్యం నింపారు

స్వయంగా మా యోగక్షేమాలు తెలుసుకుంటూ అండగా ఉన్నారు

ఆర్థికంగానూ ఆదుకొని తన గొప్ప హృదయాన్ని చాటుకున్నారు

గుంటూరు ఈస్ట్‌: బిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న మాకు.. కుటుంబసభ్యుడి కంటే ఎక్కువగా ఎంతో అండగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు రుణపడి ఉంటామని రమ్య తల్లి జ్యోతి కృతజ్ఞతలు తెలియజేశారు. రమ్యను హత్య చేసిన శశికృష్ణకు కోర్టు ఉరిశిక్ష విధించిన నేపథ్యంలో శనివారం గుంటూరులో ఆమె తల్లి జ్యోతి మీడియాతో మాట్లాడారు. ‘ఎంతో ముద్దుగా పెంచుకున్న బిడ్డను.. ఎవడో వచ్చి చంపేస్తే ఎలా ఉంటుందో మాకు తెలుసు. ఇలాంటి పరిస్థితిని భవిష్యత్‌లో తల్లిదండ్రులెవ్వరూ అనుభవించకూడదు. ఘటన జరిగినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాకు అండగా ఉన్నారు. మా కుటుంబం పక్షాన ఉండి, స్వయంగా మమ్మల్ని పిలిపించుకుని మాట్లాడటమే కాకుండా ఎప్పటికప్పుడు మా మంచి చెడ్డలు చూస్తూ ధైర్యం నింపారు. ఆర్థికంగానూ సాయం చేసి తన గొప్ప హృదయాన్ని చాటుకున్నారు. నా బిడ్డను చంపిన వ్యక్తికి ఉరి శిక్ష పడేలా చర్యలు తీసుకున్నందుకు ధన్యవాదాలు’ అని రమ్య తల్లి జ్యోతి పేర్కొన్నారు. 

మంత్రి మేరుగ పరామర్శ
గుంటూరు నగరంపాలెంలోని రమ్య కుటుంబసభ్యులను మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్, జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీక్రిస్టినా, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ మందపాటి శేషగిరిరావు, మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, డిప్యూటీ మేయర్లు సజిల, వనమా బాలవజ్రబాబు పరామర్శించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండటానికి ప్రభుత్వం దిశ బిల్లును తీసుకొచ్చిందని మంత్రి మేరుగ పేర్కొన్నారు. దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని.. కష్ట సమయంలో వినియోగించాలని సూచించారు. టీడీపీ నాయకులు శవాల మీద పేలాలు ఏరుకునే తరహాలో ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు.  

మరిన్ని వార్తలు